సుప్రీంలో కవిత పిటిషన్ పై ఈడీ కేవియెట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత పిటిషన్ ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అయితే కవిత పిటిషన్‌కు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సుప్రీంకోర్టులో శనివారం (మార్చి 18) కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై తమ వాదనలు కూడా వినాలని ఈడీ పిటిషన్‌లో కోరింది.

అంతేకాకుండా కవిత కేసు విషయంలో ఎలాంటి ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని.. తమ వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఈడీ ఆ పిటిషన్‌లో  కోరింది. ఇక  ఈడీ తాజాగా కేవియట్ పిటిషన్‌తో దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు కవిత వాదనతో పాటు ఈడీ వాదనలు కూడా విననుంది. ఆ తర్వాతే కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.

 దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. ఈ నెల 11వ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. 16‌వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఈడీ పిలిచింది. అయతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆమె 16వ తేదీన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ నెల 20వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.