రాహుల్ గాంధీ పై బహిష్కరణ వేటు?

పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు  మొదలైన మొదటి క్షణం నుంచి వారాంతం వరకు ఒకే విధంగా నడిచాయి. సహజంగా  ప్రతిపక్ష పార్టీలు సభను స్తంభింప చేస్తాయి. అయితే ఈసారి  అధికార పార్టీ, అధికార కూటమి సభను సాగనీయలేదు. బడ్జెట్ సమావేశాలు మొదలైన మొదటి రోజు  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ నాథ్ సింగ్  విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై నుంచి  దేశాన్నిఅవమానించే వ్యాఖ్యలు చేశారని  ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ లండన్ లో దేశాన్ని పార్లమెంటును అవమానపరిచే విధంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు, ఆయన పార్లమెంట్ కు, దెశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని   డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి చేసిన డిమాండ్ చినికి చినికి గాలి వానగా మారింది. ఒకటి రెండు రోజులు కాదు, ఏకంగా వారం రోజుల పాటు, పార్లమెంట్ ఉభయ సభలను పైసా పనైనా చేయకుండా స్తంభింప చేసింది.  బీజేపీ  సభ్యులు సోమవారం మొదలు శుక్రవారం వరకు వారం రోజులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. 

అఫ్కోర్స్  ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎప్పటిలానే  ఇప్పడు కూడా తమ వంతు కర్తవ్య్యాన్ని చక్కగా పోషించారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల సభ్యులు ఉభయసభల్లో ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ  నినాదాలతో హోరెత్తించారు. అటు అధికార పక్షం,ఇటు ప్రతిపక్షాల సభ్యులు అరుపులు, నినాదాలతో వారాంతం (శుక్రవారం) వరకు కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే ఉభయ సభలు, వచ్చే సోమవారం, (మార్చి 20)కి వాయిదా పడ్డాయి. 

అదలా ఉంటే, సోమవారం (మార్చి 20) పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభమైన తర్వాత, ఈ వివాదం మరో మలుపు తిరిగే అవకాశం ఉందని, జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.   లండన్‌లో భారత ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కోరుతున్న అధికార పక్షం  అందుకు ఆయన అంగీకరించని పక్షంలో ఆయన్ను లోక్ సభ నుంచి బహిష్కరించాలనే ప్రతిపాదన సభ ముందుంచే అవకాశం ఉందని అంటున్నారు. అందుకు రిహార్సల్స్ గానే గత ఐదు రోజులుగా  అధికార బీజేపీ నాయకులు, మంత్రులు  రాహుల్ వ్యాఖ్యాలను తూర్పార పడుతున్నారని అంటున్నారు.

 విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించారని.. ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని.. అప్పటిదాకా ఆయన్ను సభలో మాట్లాడనిచ్చేది లేదని స్పష్టం చేస్తోంది. మరో దేశానికి వెళ్లి దేశంలో ప్రజాస్వామ్యం బాగాలేదని చెప్పడానికి రాహుల్‌కు ఎంత ధైర్యం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తన తప్పిదాన్ని చక్కదిద్దుకుంటేనే మాట్లాడేందుకు వీలు కలుగుతుందని బిజెపి తెలిపింది. కాగా, అదానీ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ రాహుల్ ను సభ నుండి బహిష్కరించే ప్రయత్నం చేస్తున్నదని  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. అంతే కాదు, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పష్టం చేశారు.

 అయితే ఇతర ప్రతిపక్ష పార్టీలు మాత్రం రాహుల్ వ్యవహారాన్ని మరో కోణంలో చూస్తున్నాయి.  కాంగ్రెస్, బీజేపీ  కలిసి ఆడుతున్న లైవ్ డ్రామా గా చూస్తున్నాయి. రాహుల్ గాంధీని  ప్రధాని నరేంద్ర మోడీకి ప్రధాన ప్రత్యర్ధిగా ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా చూపేందుకు కాంగ్రస్ పార్టీ ప్రయత్నిస్తుంటే, బీజేపీ, రాహుల్ గాంధీ బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు  పరోక్షంగా రాహుల్ గాంధీని హీరోను చేసేందుకే, ఆయన్ని సభ నుంచి బహిష్కరించే ఆలోచన చేస్తోందని అంటున్నారు. అంటే  కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్  వేదికగా రాహుల్ బహిష్కరణ డ్రామాను తెరమీదకు తెస్తున్నాయని అంటున్నారు.  భరత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ పొలిటికల్ స్టేచర్, రాజకీయ స్థాయి పెరిగిందని కాంగ్రెస్ భావిస్తోంది. అదే క్రమంలో రాహుల్ గాంధీని ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్ధిగా చూపించే ప్రయత్న చేస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు. అలాగే,ప్రతిపక్ష్లాల మధ్య చిచ్చు పెట్టి, ఐక్యతను దెబ్బ తీసేందుకు, బీజేపీ రాహుల్ గాంధీని పావుగా వినియోగించుకున్నా వినియోగించుకుంటుంది అని కూడా అంటున్నారు,