మీ బిడ్డను నేను.. జగన్ కొత్త ఎత్తు.. జనం నమ్ముతారనేనా?
posted on Mar 1, 2023 6:11AM
అన్ని సందర్భాలలో అందరినీ నమ్మించడం, ఎవరికైనా, ఎంతటి ‘జగత్’ కిలాడీలకయినా సాధ్యం అయ్యే పని కాదనే నానుడే, వుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాత్రం, వై నాట్, అందరినీ అన్ని వేళలా నమ్మించవచ్చనే విశ్వాసంతో ముందుకెళుతున్నారు.అందుకే, ఆయన వై నాట్ 175? అంటున్నారని, రాజకీయ విశ్లేషకులు, అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి 2019లో ఎలా అధికారంలోకి వచ్చారో వేరే చెప్పనక్కర లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ ని అడ్డు పెట్టుకుని, తల్లిని,చెల్లినీ, వారి శ్రమను ఆసరా చేసుకుని, దివంగత నేత, ప్రియతమ నాయకుడు అంటూ తండ్రి పేరును ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చారు. ఒక విధంగా సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అందుకు తోడుగా, ఒక్క ఛాన్స్ ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తానని మాటిచ్చి అధికారం దక్కించుకున్నారు. ఈ నిజం అప్పుడు తెలియక పోయినా, ఇప్పడు అందరికీ అర్థమైంది. అందుకే, జగన్ రెడ్డి అటు సొంత కుటుంబాన్ని,ఇటు ప్రజలను నమ్మించి మోసం చేశారనే నిజాన్ని కొంత ఆలస్యంగానే అయినా జనం గ్రహించారని రాజకీయ పండితులు విశ్లేస్తునారు. అందుకే ఇప్పుడు జగన్ రెడ్డి కొత్తగా, ‘మీ బిడ్డను నేనంటూ’ కొత్త సెంటిమెంట్ ని తెరమీదకు తెచ్చారని, జనసేన నేత నాదెండ్ల మనోహర్ వ్యంగ విశ్లేషన చేశారు.
గతంలో దివంగత నేత, ప్రియతమ నాయకుడు.. అంటూ వైఎస్ పేరును పదే పదే ప్రస్తావించిన జగన్ రెడ్డి ఇప్పడు ఎక్కడ మాట్లాడినా మీ బిడ్డనని చెప్పుకుంటున్నారు. గతంలో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు… మామయ్యను అంటూ వరుసలు కలుపుకుని సెంటిమెంట్ పండించారు. ఇప్పుడు ఏకంగా అందరితో మీ బిడ్డనంటూ చెబుతున్నారు. అయితే జగన్ రెడ్డి ఎవరి సలహా మేరకు మళ్ళీ మరోమారు ఫ్యామిలీ సెంటిమెంట్ పండించాలని అనుకుంటున్నారో ఏమో కానీ, ఆయన సొంత కుటుంబంలోనే ఒంటరి అయ్యారనే విధంగా ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ సారి ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ అవదు సరికదా బూమ్ రాంగ్ అవుతుందని వైసీపీ నేతలే అంటున్నారు.
ఇదే విషయాన్ని జనసేన పార్టీ కూడా గుర్తు చేసింది. మీ బిడ్డనంటూ బహిరంగ సభల్లో సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన సెటైర్ వేసింది. ఇంట్లో వాళ్లనే నమ్మని బిడ్డ జనం బిడ్డ ఎలా అవుతాడని.. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సొంత ఇంట్లో కన్న తల్లి, సొంత చెల్లి వద్దన్న నేతగా పేరు పడిన జగన్మోహన్ రెడ్డిని ఏ కుటుంబమూ తమ బిడ్డగా ఒప్పుకోదని మనోహర్ స్పష్టం చేశారు.
నిజమే, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటే, అసలు ఆయన రాజకీయాల్లో నిలవగాలిగారు అంటే, అందుకు మూల కారణం ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల. జగన్ రెడ్డి జైల్లో ఉన్న 16 నెలలు ఆ ఇద్దరే పార్టీని బతికించారు. షర్మిల అయితే, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ... జగన్ రెడ్డి వదిలి వెళ్ళిన పాద యాత్ర కొనసాగించారు. వైసీపీని సజీవంగా ఉంచారు. కానీ, అధికారంలోక్ వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిన విషయమే. అలాగే కారణాలు ఏవైనా తల్లి విజయమ్మ కూడా వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి ‘గౌరవంగా’ తప్పు కున్నారు. ఇక బాబాయ్, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో వెలుగు చూస్తున్న నిజాలు ఒక విధంగా విస్మయం కల్గిస్తున్నాయి. జగన్ రెడ్డి ఇంకేమైనా కావచ్చును కానీ, కుటుంబ విలువలు గౌరవించే వ్యక్తి అంటే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు.
అందుకే, కావచ్చును నాదెండ్ల మనోహర్ ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుని పదే పదే మీ బిడ్డను చెప్పుకోవడం ఆపాలని సలహా ఇచ్చారు. తల్లి, చెల్లి విషయంలోనే కాదు.. కుటుంబం విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు తరచూ ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది. తండ్రిని చంపారంటూ.. తీవ్ర రోపణలు చేసి.. రిలయన్స్ పై దాడులు కూడా చేయించిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ రిలయన్స్ అధినేతను ఇంటికి పిలిచి.. విందు భేటీ ఇవ్వడమే కాకుండా.. రిలయన్స్ సామ్రాజ్యంలో కీలక వ్యక్తికి రాజ్యసభ సీటు కూడా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినా జగన్ రెడ్డి మూడున్నరేళ్ళలో ఏ నాడు ప్యాలెస్ గడపదాటి జనంలోకి వెళ్లని.. అనివార్యంగా వెళ్ళినా.... పరదాలు చాటున ..పోలీసు పహారాల మధ్య మాత్రమే వెళ్ళిన ముఖ్యమంత్రి ప్రజల బిడ్డ ఎట్టవుతడు? అని, అదే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాయింటే కదూ..