మెడికో ప్రీతికి న్యాయం జరిగేనా?

ర్యాగింగ్ భూతానికి బలైన డాక్టర్ ప్రీతి వ్యథ, మంత్రి కేటీఅర్ దృష్టిలో చాలా చిన్న విషయం కావచ్చును, కానీ, ఆ వ్యథ  ప్రీతి తల్లి తండ్రుల దృష్టిలో చిన్న సమస్య కాదు. ఆమె చావు. ఆ తల్లితండ్రులను  జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. వేధిస్తూనే ఉంటుంది. ప్రీతి మరణం ఆమె తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులనే కాదు,సమాజం మొత్తాన్ని బాధిస్తోంది.

మంత్రి కేటీఆర్ దృష్టిలో ప్రీతి మరణాన్ని, ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయనే చులకన భావం ఉంటే ఉండవచ్చును, కానీ, సామాన్య ప్రజలు మాత్రం ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడంలో ప్రతిపక్షాలు, మీడియా విఫల మయ్యాయనే అంటున్నారు. నిజానికి, కొద్ది మాసాల క్రితం బాసర బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన సమయంలో విద్యామంత్రి సబితా ఇంద్రా రెడ్డి, విద్యార్ధుల డిమాండ్స్  ను సిల్లీ డిమాండ్స్ అని అవమానిస్తే, ఇప్పుడు ప్రీతి మరణాన్ని మంత్రి కేటీఆర్ చిన్న సంఘటనగా పేర్కొని, పేదరికాన్ని, పేదలను మరో మారు అవమానించారు.    

ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. అయితే ఆమె ఎలా చనిపోయారు? ఆత్మ హత్య చేసుకున్నారా? హత్యకు గురయ్యారా? ఈ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. ప్రీతి పై విష ప్రయోగం జరిగిందని, ఆమె సోదరి అనుమనిన్స్తున్నారు. ప్రీతి మృతి విషయంలో ఆమె అక్క అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్జరీకి అటెండైన ఆమె అంత సడెన్‭గా ఎలా సిక్ అయ్యిందని ప్రశ్నించారు. తనంతట తానే ఎలా ఇంజక్షన్ తీసుకుంటుందని నిలదీశారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న ప్రీతి ఆర్గాన్స్ మూడు, నాలుగు గంటల్లోనే ఎలా పని చేయకుండా పోయాయని అంటున్నారు. డ్యూటీలో చేరిన కొద్ది రోజులకే అంత పవర్ ఫుల్ డ్రగ్ ను ఆమె చేతికి ఎవరిచ్చారన్న అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రీతి అక్క డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాతనే సీనియర్స్ తో ఆమెకు వాగ్వాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

ప్రీతి తన సీనియర్స్  తో మాట్లాడిన కాల్ డేటాను బయటపెడితే అసలు నిజాలు బయటికి వస్తాయని ఆమె అంటున్నారు.  అలాగే  మెడికల్ రిపోర్ట్, అదే విధంగా టాక్సికాలజీ రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ అన్నిటిని మించి పోలీసులు, డాక్టర్లు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎవరిని కాపాడేందుకు  ప్రయత్నిస్తున్నారు అనే అనుమాలు వ్యకమవుతున్నాయి. 

మరోవంక డాక్టర్ ప్రీతి ఘటనతో మెడికల్ కాలేజీలపై గవర్నర్ తమిళి సై దృష్టి సారించారు. డాక్టర్ ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని సమాచారం ఇచ్చిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వీసీకి గవర్నర్ లేఖ రాశారు. ప్రీతి ఆరోగ్యం పై తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడ్ని కాపాడేందుకు ప్రయత్నించారని యూనివర్సిటీ అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీలలో యాంటి రాగింగ్ చర్యలు గట్టిగా తీసుకోవాలని గవర్నర్ తమిళి సై సూచించారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇలాంటి సంఘటనలలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, తక్షణం స్పందించి కాలేజీలలో బాధ్యులపై కఠిన తీసుకోవాలని సూచించారు. 

నిజానికి  ప్రీతి మరణం విషయంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు మాత్రమే కాదు,  మావోయిస్టులు ఇతర సంస్థలు కూడా తప్పు పడుతున్నాయి. ప్రీతి మృతికి కారకులైనవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ మావోయిస్ట్ పార్టీ  కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన  సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశారు. ప్రీతిని సీనియర్ సైఫ్ ర్యాగింగ్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నా యాజమాన్యం  ఆ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని వెంకట్ ఆరోపించారు. ప్రీతికి న్యాయం చేయాలని విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే ఆమె ఆత్మహత్యకు సైఫ్ కారణం కాదని హాస్పిటల్ యాజమాన్యం బుకాయిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

అయితే, ప్రీతి మరణాన్నివిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్న మంత్రి కేటీఆర్  ఆమె మరణానికి మతం రంగు పులిమి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. అందుకే ఆయన సైఫ్ అయినా సంజయ్ అయినా ఎవరినీ ఉపేక్షించమని అన్నారని అంటున్నారు. అయితే, సంఘటన జరిగి వరం రోజులు అయినా ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం రాని నేపధ్యంలో, ఆమెకు న్యాయం   జరగడం అనుమానమే, అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu