ప్రవీణ్ కుమార్ టార్గెట్ ఫిక్స్? దళిత బంధు ఆశతో గులాబీ బాస్?  

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాక్కులో, వైఖరిలో క్లారిటీ వచ్చింది. తనకు రాజకీయ శత్రువులెవరో, మిత్రులెవరో గుర్తించారు. అలాగే సామాజికవర్గాల్లో తనతో వచ్చేవారెవరో అంచనా రూపొందించుకున్నారు. అందుకు సూర్యాపేటలో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన డెలివరీ చేసిన డైలాగులే సాక్ష్యం. గురుకులాల కార్యదర్శిగా రాజీనామా చేసిన తరువాత పలు ఇంటర్వ్యూల్లో ఆయన వెల్లడించిన అభిప్రాయాలకు, తాజాగా సూర్యాపేటలో ఆయన మాటల్లో స్పష్టత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందంటున్నారు ఆయన స్పీచ్ విన్నవారు. 

తాను చేసిన త్యాగానికి అర్ధం ఉండాలంటే బహుజన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తామెవరినీ అడుక్కోవలసిన అవసరం లేకుండా బహుజన రాజ్యాన్ని బహుజనులే నిర్మించుకోవాలంటున్నారు. అంతేకాదు.. డబ్బున్న అగ్రవర్ణ నేతల రాజకీయ కబంధ హస్తాల నుంచి బయట పడాలంటే బహుజన అధికార నిధి కోసం అందరూ త్యాగభావాన్ని అలవరచుకోవాలని కోరుతున్నారు. అంటే పార్టీ ఫండ్ కోసం ఎవరినో అడగడం కాదు.. తమ పార్టీ ఖర్చులు తామే భరించుకోవాలని, అప్పుడే రాజకీయ, సామాజిక యుద్ధం ఫలితాలిస్తుందని తాత్విక కోణాలు ఆవిష్కరిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రస్థానంలో దీన్ని పరిణతి గల అంశంగా చూడాలంటున్నారు రాజకీయ పండితులు.

పాలకులంతా అక్రమాస్తులతో ప్రజల్ని వంచిస్తున్నారని, ఓట్లను కొనుగోలు చేసి మోసం చేస్తున్నారని ముఖ్యంగా అధికార పార్టీ నమ్ముకున్న ఎలక్షనీరింగ్ మీద దాడిని ప్రారంభించారు ప్రవీణ్ కుమార్. తెలంగాణ అమరుల త్యాగాల మీద ఇంకొకరు సుఖపడటమేంటని, అసలు అమరులైనవారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలవారేనంటూ పరోక్షంగా అన్ని సామాజికవర్గాల్లో ఆలోచన రేకెత్తిస్తూ బహుజన రాజ్యాధికారానికి బాటలు వేస్తున్నారు. చరిత్రాత్మక నల్లగొండ జిల్లాలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు ప్రవీణ్. 

దళిత, బహుజన, మైనారిటీ వర్గాలతో కదం కదం కలిపి నడిచేందుకు ఇప్పటికే వ్యూహరచన చేసుకున్న ప్రవీణ్.. అగ్రవర్ణ అభిజాత్యపు విమర్శల్లో నిండా మునిగిన కేసీఆర్ మీద సామాజిక అస్త్రాలు సంధించేందుకు రెడీ అయ్యారు. అందుకు గ్రౌండ్స్ కూడా చాలా పటిష్టంగా తయారు చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 8న బీఎస్పీలో చేరిక ఖాయమైపోగా అంతకుముందు ప్రతిరోజూ ప్రజల్లో ఉండేందుకు, మీడియాలో ఉండేందుకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలు కవరయ్యేలాగా రోజుకో జిల్లాలో సమ్మేళనాలు నిర్వహించి తాను పార్టీ కండువా కప్పుకునేనాటికి విపరీతమైన హైప్ క్రియేట్ చేయాలని స్కెచ్ వేసుకున్నారు. ఆయన ఆ దిశగానే కదులుతుండడం అటు టీఆర్ఎస్ అధినాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. చాపకింద నీరులా వస్తున్న ప్రవీణ్ కుమార్ (పీకే), ఆయన స్వేరో సైన్యానికి జడిసే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధును అకస్మాత్తుగా హుజూరాబాద్ ఎన్నికకు ముందే ప్రకటించాల్సి వచ్చిందంటున్నారు. 

అటు పీకే కూడా తన లోగుట్టు కేసీఆర్ గుర్తించడం వల్లే ఇటీవల కేబినెట్ భేటీలో తన గురించి చాలాసేపు చర్చ జరిగిందని, ఆ తదుపరి తనపై ప్రభుత్వం శాఖాపరంగా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉన్నందువల్లే ఆరేళ్ల సర్వీసును త్యాగం చేయాల్సి వచ్చిందన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నన్ని రోజులు కేసీఆర్ సర్కారుకు ఎక్కడా వ్యతిరేకంగా కనిపించకుండా అణిగిమణిగి ఉన్న పీకే, ఆ బాధ్యతలను పక్కన పెట్టగానే సర్కారు మీద అస్త్రాలు ఎక్కుపెట్టడం గమనించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే హుజూరాబాద్ లో పీకే పోటీ చేయడాన్ని కూడా కొట్టిపారేయలేమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.