జ‌నాల‌కు చెవిలో పువ్వు.. బీజేపీ మాట‌ల‌కు అర్థాలే వేరులే..

2014లో భారీ మెజార్టీతో గెలిచింది బీజేపీ. అద్వానీనే ప్ర‌ధాని అనుకున్నారంతా. పెద్దాయ‌న‌కు వ‌య‌సు మ‌ళ్లిందంటూ ప‌క్క‌న‌పెట్టేసి.. అంద‌ల‌మెక్కారు మోదీ. ఎప్ప‌టికైనా త‌న దారికి అడ్డొస్తార‌నేమో మ‌రో సీనియ‌ర్ నేత‌ ముర‌ళీమ‌నోహ‌ర్ జోషినీ అదే సాకుతో అడ్డు తొల‌గించుకున్నారు. 70 ఏళ్లు దాటిన వారికి ప‌ద‌వుల్లేవ్ అంటూ బాజా మోగించారు. అదే కార‌ణంతో తాజా కేబినేట్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లోనూ కొంద‌రు సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేశారు. లేటెస్ట్‌గా మ‌రో వ‌య‌సు వేటు ప‌డింది. క‌ర్ణాట‌క సీఎం కుర్చీ నుంచి 79 ఏళ్ల య‌డ్యూర‌ప్ప‌ను అర్థాంత‌రంగా దింపేసింది బీజేపీ. ఆయ‌న సీఎం ప‌ద‌వి చేప‌ట్టి రెండేళ్లే అవుతోంది. అంటే, అప్పుడాయ‌న వ‌య‌సు 77. ఈ లెక్క‌న 77 ఏళ్లు ఉంటే వ‌య‌సులో ఉన్న‌ట్టు.. 79 వ‌స్తే వ‌య‌సు మీరిన‌వాడు అన్న‌ట్టా బీజేపీ ఉద్దేశ్యం? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదంతా జ‌నం చేవిలో క‌మ‌లం పువ్వు పెట్ట‌డమేన‌ని.. కాషాయ పెద్ద‌లు ఆడుతున్న రాజ‌కీయ క్రీడ‌కు య‌డ్యూర‌ప్ప బ‌లైపోయార‌ని అంటున్నారు. 

బీజేపీ చెబుతున్న కుంటి సాకుల‌పై సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెటైర్లు పేలుతున్నాయి. ఇటీవ‌ల‌ 89 ఏళ్ల మెట్రో మ్యాన్ శంక‌ర‌న్‌ను కేర‌ళ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన బీజేపీకి అప్పుడు ఈ ఏజ్ ఫ్యాక్ట‌ర్ గుర్తుకు రాలేదా? అని నిల‌దీస్తున్నారు. కేరళ‌కో రూల్‌.. క‌ర్ణాట‌క‌కు మ‌రో రూలా? అని మండిప‌డుతున్నారు. వ‌చ్చే సెప్టెంబ‌ర్ 17కి మోదీకి సైతం 70 ఏళ్లు నిండుతాయ‌ని.. మ‌రి ఆయ‌న కూడా ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి వైదొలుగుతారా? అని సోష‌ల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు నెటిజ‌న్లు. 

క‌ర్ణాట‌క‌లో రెండేళ్ల‌కే సీఎం మారిపోయారు. అటు, ఉత్త‌రాఖండ్‌లోనూ ఇప్ప‌టికే ముచ్చ‌ట‌గా ముగ్గురు ముఖ్య‌మంత్రులు చేంజ్ అయ్యారు. ఇక‌, గ‌వ‌ర్న‌ర్లు సైతం ప‌దే ప‌దే మారుతుండ‌టం కామ‌న్‌గా మారింది. ఇక మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డానికి ఎన్సీపీని చీల్చే ప్ర‌య‌త్నాన్ని దేశ‌మంతా అస‌హ్యించుకుంది. బెంగాల్‌లో మ‌మ‌త స‌ర్కారును కేసుల‌తో భ‌య‌భ్రాంతుల‌ను గురి చేస్తున్న‌ వైనాన్ని అంతా గ‌మ‌నిస్తూనే ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు వ్య‌తిరేకంగా లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌ను ఉసిగొల్పుతున్న తీరు బీజేపీకే మైన‌స్‌గా మారుతోంది. 

ఇక ఏపీలో వైసీపీ స‌ర్కారుతో కుమ్మ‌క్కై.. జ‌గ‌న్‌కు సీబీఐ ర‌క్ష క‌ల్పిస్తుండ‌టం.. ప్ర‌త్యేక హోదా అట‌కెక్కించ‌డం, పోల‌వ‌రం నిధుల‌కు గండి పెట్ట‌డం.. విశాఖ ఉక్కును అడ్డంగా అమ్ముకోబోతుండ‌టం.. అడ్డ‌గోలు అప్పులు, ఆల‌యాల‌ దాడుల‌పై జోక్యం చేసుకోకుండా అవినీతి, అరాచ‌క ప్ర‌భుత్వానికి కొమ్ముకాస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అటు, తెలంగాణ‌కు ఐటీఐఆర్ కారిడార్‌ ఎగ్గొట్ట‌డం.. బీహార్‌కు నిధుల వ‌ర‌ద పారించ‌డం.. ఇలా దేశాన్ని విభ‌జించి పాలిస్తోంద‌నే ఆగ్ర‌హం ప్ర‌జ‌ల నుంచి వెల్లువెత్తుతోంది. విదేశాల నుంచి న‌ల్ల‌ధ‌నం తీసుకొస్తామంటూ బీజేపీ ఆడిన‌ డ్రామాను ప్ర‌జ‌లు ఎప్పుడో మ‌ర్చిపోయినా.. తాజాగా వివిధ రాష్ట్రాల‌తో, వివిధ పార్టీల‌తో క‌మ‌ల‌నాథులు ఆడుతున్న పొలిటిక‌ల్ డ్రామాను చూసి అంతా అస‌హ్యించుకుంటున్నారు. 

గ‌తంలో కాంగ్రెస్ ఇలానే చేస్తే.. ఆ పార్టీకి బుద్ది చెప్పి.. రెండు ప‌ర్యాయాలుగా అధికారానికి దూరం పెట్టారు ప్ర‌జ‌లు. గ‌తంలో ముఖ్య‌మంత్రుల‌ను ప‌దే ప‌దే మార్చే సంస్కృతి కాంగ్రెస్‌దే. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు వాడుకునే అల‌వాటు కాంగ్రెస్‌దే. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను చీల్చి.. రాష్ట్రాల‌ను విభ‌జించి పాలించిన చ‌రిత్ర కాంగ్రెస్‌దే. అందుకే, ఆ పార్టీకి క‌ర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పుడు బీజేపీ సైతం నాటి కాంగ్రెస్ అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తోందని అంటున్నారు. ఆ తాను ముక్కేనంటూ మండిప‌డుతున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు అవినీతికి కేరాఫ్‌గా మారితే.. బీజేపీ స‌ర్కారుకు సైతం ఎంతోకొంత అవినీతి మ‌ర‌క అంట‌క‌పోలేదు. ర‌ఫేల్ కొనుగోళ్ల‌లో భారీ స్థాయిలో క‌రెప్ష‌న్ జ‌రిగింద‌నేది ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌. దేశ సంప‌ద‌ను అంబానీ, అదానీల‌కు దోచిపెడుతున్నార‌నే విమ‌ర్శ‌. మాల్యా, మోదీ, చోక్సీలు బ్యాంకుల‌ను కొల్ల‌గొట్టి విదేశాల‌కు చెక్కేయ‌డం స‌ర్కారు చేత‌గానిత‌న‌నేన‌నే ప్ర‌చారం. ఇక పెగాస‌స్‌తో బీజేపీ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అవుతోంది. దేశ ప్ర‌జ‌ల‌పైనే నిఘా పెట్టిన బ‌రితెగింపుతో బాగా బ‌ద్నామ్ అవుతోంది. అందుకే, రోజురోజుకీ బీజేపీ గ్రాఫ్ బాగా ప‌డిపోతోంది. తీరు మార‌క‌పోతే.. కాంగ్రెస్ వాస‌న‌లు వీడ‌క‌పోతే.. కాషాయ పార్టీకి సైతం కాంగ్రెస్‌లా శిక్ష త‌ప్ప‌క‌పోవ‌చ్చని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి, కాషాయ పార్టీకి ఇప్ప‌టికైనా క‌నువిప్పు క‌లిగేనా? ఇలానే క‌ళ్లు మూసుకొని పాలిస్తుందా?