కవితకు పెద్దల సభ ఎందుకు మిస్సైంది? అమిత్ షా తో కేసీఆర్ డీల్ ఏంటీ? 

నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా రెండో సారి ఎన్నికయ్యారు కల్వకుంట్ల కవిత. ఆమె ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక లేకుండానే ఏకగ్రీవమయ్యారు. అయితే కవిత రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే ముందు రాజకీయంగా కీలక పరిణామాలు జరిగాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లతో టీఆర్ఎస్ మొదట ఇచ్చిన జాబితాలో కవిత పేరు లేదు. నిజామాబాద్ ను పెండింగులో పెట్టారు. తర్వాత నిజామాబాద్ నుంచి ఆకుల లలితను ఖరారు చేశారని లీకు ఇచ్చారు. అంతకు కొన్ని రోజుల ముందే  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎంపిక సందర్భంగా కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ ను మండలి పంపించారు. బండా ప్రకాశ్ ఎమ్మెల్సీ కావడంతో ఆయన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.  దీంతో ఆ స్థానాన్ని కవితకు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని,  అందుకే ఆమెకు రెండోసారి ఎమ్మెల్సీ ఇవ్వ లేదని అంతా భావించారు. 

కవితకు రాజ్యసభ సీటు ఖారరైందని గులాబీ లీడర్లు కూడా ఓపెన్ గానే ఈ విషయం చెప్పారు. కాని ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు మళ్లీ సీన్ మారింది. పెద్దల సభకు కాకుండా కవితను శాసనమండలికే పంపిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ లీడర్లు కూడా షాకయ్యారు. రాజ్యసభకు వెళ్లాల్సిన కవిత మళ్లీ మండలికే ఎందుకు వెళుతోంది, కేసీఆర్ నిర్ణయం ఎందుకు మారిందన్నది ఎవరికి అర్ధం కాలేదు. అయితే కవితను రాజ్యసభకు కాకుండా మండలికి పంపించడం వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కీలక రాజకీయ పరిణామాలు జరిగాయంటున్నారు. 

కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ తో పాటు కవిత కూడా ఉన్నారు. కేసీఆర్ సతీమణి శోభకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమెకు ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు జరిపించారు. దీంతో ఆమెకు తోడుగా కుటుంబ సభ్యులంతా కేసీఆర్ ఢిల్లీ నివాసంలో ఉన్నారు. ఈ సందర్భంగా కవిత రాజకీయ కార్యాచరణకు  సంబంధించి కేసీఆర్ నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య హాట్ హాట్ డిస్కషన్స్ జరిగాయంటున్నారు. కవిత మొదటి నుంచి తెలంగాణ మంత్రివర్గంలో మంత్రి కావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ను ఆమె ఆదే డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కవితను కేబినెట్ లోకి తీసుకుంటే రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావించిన కేసీఆర్.. ఆమెను రాజ్యసభకు పంపి బీజేపీ పెద్దలతో మాట్లాడి కేబినెట్ మంత్రిని చేయాలని చూశారట.

ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లిన కేసీఆర్.. కవిత కేబినెట్ బెర్త్ అంశంపై చర్చించారని తెలుస్తోంది. ఇద్దరు అరెస్సెస్ నేతల ద్వారా ఆయన ఈ లాబీయింగ్ చేశారంటున్నారు. కవితకు కేంద్ర కేబినెట్ లో సహాయమంత్రి అయినా ఇవ్వాలని కోరారట కేసీఆర్. అందుకు ప్రతిఫలంగా 2024లో కేంద్రంలో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పారట. అయితే కేసీఆర్ అభ్యర్థనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం చెబుతామని చెప్పిన అమిత్ షా.. తర్వాత ఏ హామీ ఇవ్వలేదట. కవిత విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదనే సమాచారాన్ని కేసీఆర్ కు పంపించారట అమిత్ షా. దీంతో బీజేపీ పెద్దల నుంచి కేబినెట్ బెర్త్ పై హామీ లభించకపోవడంతో... కవితను రాజ్యసభకు కాకుండా శాసనమండలికే పంపాలని నిర్ణయించి.. అప్పటికప్పుడు ప్రకటించేశారట కేసీఆర్. 

ఢిల్లీలో జరిగిన పరిణామాలతో కవిత కూడా షాకయ్యారని చెబుతున్నారు. అయితే మండలికి ఎన్నికయ్యాక రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటానని కేసీఆర్ చెప్పడంతో ఆమె కూల్ అయ్యారని తెలుస్తోంది. కవితను మండలికి పంపించడంతో ఆకుల లలితకు మరో కీలక పదవి ఇస్తామని గులాబీ బాస్ హామీ ఇచ్చారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే తమకు ఇస్తారన్న సీటును చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసినా.. కవిత నామినేషన్ కార్యక్రమంలో ఉత్సాహంగానే పాల్గొన్నారని చెబుతున్నారు. మొత్తంగా పెద్దల సభకు వెళ్లాల్సిన కవిత.. బీజేపీ పెద్దల నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో మండలికి వచ్చిందని, ఆమె త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలో చేరుతుందనే ప్రచారం తెలంగాణ భవన్ లో చక్కర్లు కొడుతోంది.