మహా పాదయాత్రకు నెల రోజులు.. అమరావతి రైతులకు అడుగడుగునా హరతులు..

‘ఒకటే రాష్ట్రం ... ఒకటే  రాజధాని’,  ‘ఆంధ్ర ప్రదేశ్  ఏకైక రాజధాని అమరావతి’ అనే నిదానాలతో అమరావతిని ఏకైక రాజధానిగా నిలుపుకోవాలన్న సంకల్పంతో’ నవంబర్ ఒకటిన, చేపట్టిన మహా పాదయాత్ర నెలరోజులు పూర్తి చేసుకుని రెండవ నెలలోకి ఎంటర్ అవుతోంది. 

ఒక లక్ష్య సాధనకోసం ఊరువాడా కదిలి రావడం, ముఖ్యంగా మహిళలు ముందుండి పాదయాత్ర సాగించడం చరిత్రలో నిలిచి పోతుందని అంటున్నారు. కాగా, 30వ రోజుకు చేరిన రైతుల మహాపాదయాత్ర అన్ని ప్రాంతాలనూ కదిలిస్తోంది.అన్ని వర్గాలప్రజలను నడిపిస్తోంది. కాగా, ఈ ఉదయం నెల్లూరు జిల్లా అంబాపురం నుంచి మొదలైన పాదయాత్రలో విశేషంగా అధిక సంఖ్యలో స్థానిక ప్రజల పాల్గొన్నారు. అమరావతి ఏకైక రాజధాని నినాడంలో గొంతు కలిపారు. కాలు కలిపి కదం తొక్కారు.  'న్యాయస్థానం నుంచి దేవస్థానం'’ పేరిట తుళ్లూరు నుంచి తిరుమల వరకూ నవంబర్ 1న మహా పాదయాత్రను చేపట్టారు. 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర... డిసెంబర్ 15న తిరుమలకు చేరుకునేలా ప్రణాళికను రూపొందించారు.

ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మాదిరిగా వైకాపా నేతల అందరిలోనూ మార్పు రావాలని అమరావతి రైతులు ఆకాంక్షించారు. ఇప్పటికైనా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌... మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గాలని డిమాండ్‌ చేశారు. కుల, మతాలకు అతీతంగా పాదయాత్రలో పాల్గొనేందుకు ప్రచార రథాలు వస్తునాయని... వాటిని పోలీసులు అడ్డుకోవటం దారుణమన్నారు. అమరావతి అందరిదని చాటేందుకు తూళ్లూరు నుంచి వస్తున్న రథాలను అడ్డుకోవడం మంచిది కాదని హెచ్చరించారు