గోరంట్ల మాధవ్ విషయంలో జగన్ సైలెంటెందుకయ్యారంటే..?

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ .. రాసలీల వీడియో.. బయటకు వచ్చి మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఆయనపై  జగన్ సర్కార్ చర్యలు తీసుకొకుండా మీన మేషాలు లెక్కించడంపై ఫ్యాన్ పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతున్నది.  గోరంట్ల మాధవ్ వీడియో.. అటు మీడియాలో... ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత గోరంట్ల మాధవ్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి... ఇదంతా టీడీపీ వాళ్ల కుట్ర... తన జిమ్ చేస్తున్న వీడియోను ఇలా మార్పింగ్ చేశారని చెప్పుకొచ్చారు.

అయితే ఈ గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో  వ్యవహారం ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు తావిచ్చినా, ప్రభుత్వ పరువు గంగలో కలిసిపోతున్నా జగన్ ప్రభుత్వం   సైలెంట్‌గా ఉండడం వైసీపీలోని కొందరు కీలక నేతలు సైతం అంతర్గత సంభాషణల్లో తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.  జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో కూడా దాదాపుగా అందరూ నోరున్న మంత్రులే కొలువు తీరారని.. అయినా ఇంత నిశబ్దమేమిటని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకో వైపు ఇదే అంశంపై   ప్రభుత్వ   సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గోరంట్ల.. తన వీడియో.. మార్పింగ్ అని అంటున్నారు.... అయితే ఈ వీడియో నిజమని ఫోరెన్సిక్ నివేదికలో స్పష్టమైతే  తప్ప చర్య ఎలా తీసుకుంటాం అని ప్రశ్నించారు. ఒక వేళ వీడియో మార్ఫింగ్ అని తేలితే ఆ మార్ఫింగ్ చేసిన వారిని వదలం అన్న అర్ధం వచ్చేలా ఆయన మాట్లాడారు. దీంతో ప్రభుత్వం గోరంట్ల అసభ్య వీడియో విషయంలో ఎవరినో బలిపశువును చేయడానికి చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. 

మరోవైపు.. గోరంట్ల వ్యవహారంపై సీఎం జగన్‌తో సజ్జల వరుసగా భేటీలు కావడం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో సీఎం జగన్ ఇప్పటికీ సైలెంట్‌గా ఉండడం వెనుక తెరచాటు రాజకీయమేదో  జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనుమానిస్తున్నారు.

 గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో నిజమైనదేనని ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలని ఎంపీ మాధవ్‌ను  పార్టీ హై కమాండ్ కోరిందనీ, అందుకు గోరంట్ల మాధవ్   తన  బీసీ కులం కార్డు,  గత కేబినెట్‌లో.. ప్రస్తుత కేబినెట్‌లోని మంత్రుల ఆడియో టేపులు, ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం, చివరకు  గుడివాడ కేసినో వ్యవహారం.. కొందరు వైసీపీ నేతల అక్రమ మైనింగ్ తదితర అంశాలతో కూడిన చిట్టాను బయటపెట్టినట్లు చెబుతున్నారు. తనపై చర్య తీసుకుంటే వీటన్నిటినీ బయటపెడతానంటూ బ్లాక్ మెయిలింగ్ కు తెరతీయడంతోనే దొంగకు తేలు కుట్టిన చందంగా జగన్ సైలెంట్ అయిపోయారనీ, అదే విధంగా పార్టీలోని అందరూ కూడా గోరంట్ల మాధవ్ విషయంలో నోరెత్త వద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారనీ వైసీపీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి. 

 అలాగే  ఇప్పుడు గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకుంటే.. గతంలో పార్టీలో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న వారిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్న తలెత్తుతుంది.  దాని కంటే గోరంట్ల వ్యవహారంపై చూసి చూడనట్లు  ఊరుకుంటే ఈ అంశం దానంతట అదే మరుగుపడుతుందని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.