ప్రాణాలకు ముప్పుందంటూ రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించిన చీకోటి

చీకోటి ప్రవీణ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకూ పరిచయం అక్కర్లేని పేరు. క్యాసినోల నిర్వాహకుడిగా ఆయన పేరు మార్మోగిపోతోంది. ఈడీ విచారణలో ఆయన వెల్లడించిన విషయాల ఆధారంగా ఈడీ పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది.

వారిలో పలువురు రాజకీయ నేతలు కూడా ఉన్నారు. అందులోనూ మంత్రులూ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులూ, మాజీ ఎమ్మెల్యేలూ కూడా ఉన్నారు. ఇప్పుడు అదే ఆయన ప్రాణం మీదకు తెచ్చిందని అంటున్నారు. పలువురు ప్రముఖులతో ఆయనకు ఉన్న పరిచయాలు తన క్యాసినో వ్యాపారాన్ని మూడు పువ్వులూ ఆరుకాయులుగా విస్తరించిన చీకోటి ప్రవీణ్ ఈడీ విచారణలో బయటపెట్టిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

పలువురు ప్రముఖులకు క్యాసినోలతో ఉన్న సంబంధాలను వెల్లడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చీకోటి ప్రవీణ్ తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ హైకోర్టును ఆశ్రయించారు. రక్షణ కల్పించాలని కోరుతున్నారు. చీకోటి చెప్పుకున్నట్లుగా ఆయన నిర్వహిస్తున్న క్యాసినోలు ఏమీ లీగల్ వ్యవహారం కాదు. గతంలో కూడా ఇదే విషయంలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. కాగా చీకోటి క్యాసినో వ్యవహారాలతో వందల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది.

ఈ వ్యవహారంలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు వెల్లడౌతున్న నేపథ్యంలోనే చీకోటి ప్రవీణ్ తన ప్రాణానికి ముప్పు ఉందంటూ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చీకోటి వ్యవహారంలో పలువురు ప్రముఖుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి ద్వారానే చీకోటి ప్రాణాలకు ముప్పు ఉందని పలువురు అంటున్నారు. చీకోటి నివాసాలపై ఈడీ దాడుల వ్యవహారం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ పలువురు రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు రెపిందని చెబుతున్నారు.