ఎవరీ దర్షిత్
posted on May 31, 2023 6:37AM
అలా వచ్చాడు.. ఇలా స్టేజ్ ఎక్కాడు.. చెప్పాల్సింది.. కట్టె కొట్టే తెచ్చే తరహాలో నాలుగు ముక్కల్లో నలగ్గొట్టేశాడు. ఇంకా చెప్పాలంటే.. స్ప్రైట్ తాగినట్లు ఎక్కడ సుత్తి లేకుండా.. చాలా నేర్పుగా... నేరుగా చెప్పేశాడు.. దటీజ్ పోట్లూరి దర్షిత్. అతిరథ మహారధులు పాల్గొన్న రాజమహేంద్రవరం మహానాడులో నూనుగూ మీసాల యువకుడు దర్షిత్ జగన్ నాలుగేళ్ల పాలన గుట్టును జస్ట్ 4 నిమిషాల 44 సెకన్లల్లో విప్పేశాడు. అతగాడి వాగ్దాటికి.. వేదికపై ఉన్న సీనియర్లే కాదు.. ఈ మహానాడుకు విచ్చేసిన వారు సైతం ముగ్దులయ్యారు. దీంతో మహానాడులో దర్షిత్ వజ్రంలా మెరిశాడు. అయితే ఇంతకీ ఈ దర్షిత్ ఎవరు, ఏం చేస్తుంటాడంటూ నెటిజన్లు గుగూల్‌ను ఆశ్రయిస్తున్నారు.
పోట్లూరి దర్షిత్. స్వస్థలం విజయవాడ. బాల్యం నుంచి విద్యాభ్యాసమంతా విజయవాడలోనే జరిగింది. ప్రస్తుతం స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోన్నారు. 2015లో దర్షిత్ వయస్సు 11 ఏళ్లు... అప్పటికే రాష్ట్ర విభజన జరిగిపోయి.. 2014 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర నూతన రాజధానిగా అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ క్రమంలో చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేపట్టగా.. దర్షిత్... తాను దాచుకొన్న 2 వేల రూపాయిల నగదును సీఎం చంద్రబాబుకు స్వయంగా అందజేశారు. అలా పోట్లూరి దర్షిత్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.
రాజధాని, రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై సంపూర్ణ అవగాహాన ఉన్న పోట్లూరి దర్షిత్.. 2019 ఎన్నికల వేళ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని దాదాపు 10 నుంచి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు మాత్రం జగన్ పార్టీకి పట్టం కట్టారు. అయితే అదే ఏడాది అంటే 2019 డిసెంబర్ 17న రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక ప్రకటన చేయడంతో.. రాజధాని ప్రాంతంలో అలజడి ప్రారంభమైంది. దీంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు డిసెంబర్ 18 నుంచి ఆందోళన బాట చేపట్టారు.
ఆ క్రమంలో ఆందోళనకు దిగిన రైతులపై జగన్ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. అణచివేతకు గురిచేసింది. అమరావతి స్టూడెంట్ కో-ఆర్డినేషన్ సైతం ఈ ఆందోళనలో భాగస్వామ్యం అయింది. దీంతో మైనర్ దర్షిత్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయడమే కాకుండా.. అతడిని గృహనిర్భంధం చేశారు. దాంతో దర్షిత్‌పై పోలీసుల ఆమానుష చర్యను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
ఇక భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు దర్షిత్ స్వయంగా రెండు పేజీల లేఖ రాశారు. తెలుగులో.. ఆ లేఖలో సారాంశం, రాసిన తీరు అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వీరమణను ఆకట్టుకుంది. దర్షిత్ లేఖకు జవాబు రాశారు. అలాగే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాద్యతలు చేపట్టి ఆయన తొలిసారి.. తన సొంత ఊరుకు వస్తున్నానని.. ఈ సందర్భంగా వచ్చి తనను కలవాలంటూ సందేశం పంపగా.. జస్టిస్ ఎన్. వి. రమణను దర్షిత్ కలిశారు. అలాగే భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడును సైతం దర్షిత్ కలిశారు. దర్షిత్ వాగ్దాటి, ఆలోచన తీరు, రాష్ట్ర పరిస్థితులపై అతి చిన్న వయస్సులోనే అంతగా అవగాహన ఉండడం పట్ల వెంకయ్యనాయుడు శుభాశీస్సులు అందుకున్నారు. జగన్ నాలుగేళ్ల పాలనపై చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదిగాక ప్రజల్లోకి తీసుకు వెళ్లి.. వారిని చైతన్యవంతులుగా మార్చేందుకు శ్రమిస్తున్నాడు దర్షిత్.
ఇక పోట్లూరి దర్షిత్‌లోని దీక్ష, పట్టుదల, ఆలోచన సరళి, ప్రజా సమస్యలపై పోరాడే గుణం, ప్రజా సమస్యలపై అధికార పార్టీని ప్రశ్నించే తత్వం చూసి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అచ్చెరువొందారు. దీంతో 2021లో టీడీపీ విద్యార్థి విభాగం అధికార ప్రతినిధిగా దర్షిత్‌ని నియమించారు.
అయితే జగన్ ప్రభుత్వంలో అదీ తొలి కేబినెట్‌లో మంత్రులు నాని బ్రదర్స్, అనిల్ కుమార్ యాదవ్ వగైరా వగైరా.. మలి కేబినెట్‌లో మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, ఆర్కే రోజా లాగా తొడలు కొట్టలేదు.. మీసాలు మెలేయ లేదు.. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే పచ్చి బూతులు మాట్లాడలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన, ప్రజలు పడుతోన్న ఇబ్బందులపైన కనీస అవగాహన లేని వీరి వల్ల.. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్... మరింత నష్టపోతుందనే భావన ప్రజల్లో నిగూఢంగా ఉంది.
అయితే వయస్సులో చాలా చిన్నవాడైన దర్శిత్ ఆలోచన సరళి, అతడి మాట్లాడే విధానం.. భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలుస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదన్నది సుస్పష్టం. మరోవైపు జగన్ అధికారలోకి వచ్చిన తర్వాత.. కొడాలి నాని చేసిన ప్రతీ విమర్శకు.. అంతే ఇదిగా.. చాలా పద్దతిగా కౌంటర్ ఇచ్చిన ఒకే ఒక్కడీ దర్షిత్. అందుకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియలో సైతం ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.