ఫినిష్ చేసేస్తారా? ప్రజాస్వామ్యమా? అరాచకమా?
posted on May 31, 2023 7:06AM
ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది... అలాంటి వేళ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా? తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అమదాలవలసలో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుకు భద్రతగా ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోలను తీసివేస్తే ఆయన ఫినిష్ అయిపోతారని, వారు ఉన్నారన్న ధైర్యంతో ఆయన మాట్లాడుతున్నారంటూ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు ఎవరిని ఉద్దరించడానికి ఆయనకు ఈ బ్లాక్ క్యాట్ కమాండోస్ భద్రత అంటూ ప్రశ్నించారు. ఆయనకు బ్లాక్ క్యాట్ కమాండోలు ఉపసంహరించాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా తాను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని కూడా తమ్మినేని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన ఈ వ్యాఖ్యల పట్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ బద్దమైన స్పీకర్ పదవిలో ఉండి తమ్మినేని సీతారాం ఇలా మాట్లాడడం... దేనికి సంకేతమని ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇటువంటి వ్యాఖ్యలు జగన్ పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు.. అంటే మాజీ మంత్రులు నాని బ్రదర్స్, అనిల్ కుమార్ యాదవ్, అలాగే ప్రస్తుత మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా లాంటి వాళ్లు చేస్తే.. రోటిన్ అనుకోవచ్చు. కానీ తమ్మినేని సీతారాం చేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇంకోవైపు వైయస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలూ, శ్రేణులే అంగీకరిస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లారు.. వెళ్తున్నారు. వీటికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. అలాగే గతే ఏడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడు సక్సెస్ అయిందని. అదేవిధంగా ఈ ఏడాది రాజమహేంద్రవరం వేదికగా తాజాగా నిర్వహించిన మహానాడు సైతం సూపర్ డూపర్ సక్సెస్ అయింది. తెలుగుదేశం కార్యక్రమాలకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
ఇక గతంలో చంద్రబాబు నివాసంపైకి మంది మార్బలంతో అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి వెళ్లడం.. అలాగే జగ్గయ్యపేట పర్యటనలో ఉన్న చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగడం... ఆ సమయంలో ఆయన భద్రతా సిబ్బందికి గాయాలు కావడం.. ఒక కమెండోకు నిజమైన కుట్లు పడటం తెలిసిందేప. ఇక కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబును అడ్డగించడం.. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అండ్ కో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అలాగే గతేడాది డిసెంబర్ చివరలో చంద్రబాబు రోడ్డు షో సందర్భంగా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో 8 మంది విగత జీవులు కాగా. ఈ సంఘటన జరిగిన మూడు రోజులకే గుంటురులో చంద్రన్న కానుక పంపిణి సందర్బంగా జరిగిన తోపులాటలో పలువురు మరణించారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ (1) తీసుకు వచ్చింది. సదరు జీవోపై ప్రతిపక్షాలను అణగదొక్కేందుకేనంటూ విపక్షాలు సైతం నిరసన వ్యక్తం చేశాయి.ఆ జీవోను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.
గతంలో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపైన.. అలాగే గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపైన అధికార పార్టీ శ్రేణులు దాడి చేస్తుంటే...రక్షక భట వర్గం ప్రేక్షక పాత్ర వహించడం వినా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండటం. రాష్ట్రంలో నెలకొన్న అరాచకత్వానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే టీడీపీ నేతలపై వరుస దాడులు జరుగుతోన్నాయి. అందుకు పార్టీ అధికార ప్రతినిధి కె. పట్టాబి అంశమే ఓ ఉదాహరణగా ,చెప్పవచ్చు.
మరోవైపు అధికారం అందుకోవడం కోసం ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై ఎయిర్ పోర్ట్ వేదికగా కోడికత్తి దాడి ఎపిసోడ్ చోటుచేసుకోవడం... అలాగే వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా అత్యంత దారుణంగా హత్య కావింప బడడం.. సదరు కేసులన్నీ కాలం గడుస్తున్నా.. కేంద్ర దర్యాప్తు సంస్థల చేతి లో భద్రంగానే ఉన్నాయని వారు వివరిస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న పరిణామాలకు పోలీసులు సాక్షీభూతంగా నిలుస్తున్నారు.. తప్ప వాటిని నియంత్రించే పనిని వారు చేయలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వ్యాఖ్యలు చంద్రబాబు భద్రతపై ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయనీ, అటువంటి వ్యాఖ్యలు చేసిన తమ్మినేనికి ఒక్క క్షణం కూడా స్పీకర్ గా కొనసాగే అర్హత లేదనీ తెలుగుదేశం శ్రేణులే కాదు, రాజకీయ పండితులు, న్యాయ నిపుణులు సైతం అంటున్నారు.