వివేకా హత్య కేసులో ఎ9 ఎవరు?

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి  జగన్ స్వంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టును తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, పదే పదే న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ అరెస్టును వాయిదా వేయించుకుంటున్న తీరు తీవ్ర చర్చనీయంశమైంది.

ఇక తెలంగాణ హై కోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. సుప్రీం కోర్టు ముందస్తు బెయిలుపై ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయం పక్కన పెడితే.. ఈ కేసులో సీబీఐ అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో నూ, భాస్కర్ రెడ్డి బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన అఫడివిట్ లోనూ జగన్ పేరు ప్రస్తావించడం సంచలనం సృష్టించింది. వివేకా హత్య కేసు దర్యాప్తునకు ఏపీలో అడుగడుగునా అడ్డంకులు ఎదురు కావడం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు చాలా కాలంగా వ్యక్తమౌతున్నాయి.

సొంత బాబాయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ తన సర్వశక్తులూ ఒడ్డి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిస్తే చాలు జగన్ ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐ వేగం మందగించేలా కార్యం చక్కబెట్టుకు వచ్చేవారని స్వయంగా వైసీపీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే  వివేకా హత్య కేసులో జగన్ కూడా విచారణకు హాజరు కాక తప్పదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సమాచారం, అందరికంటే ముందే జగన్ మోహన్ రెడ్డి కి తెలుసు. ఆయనకు ఆ విషయాన్ని అవినాష్ రెడ్డే చేరవేశారన్నది తమ అనుమానంగా సీబీఐ చెబుతోంది.

అందుకే అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమని కోర్టుకు స్పష్టంగా చెప్పింది.  ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొనాల్సి రావడం అనివార్యమన్న భావన ఆ వర్గాల్లో వ్యక్తమౌతోంది.   కేసు ఇంత వరకూ రావడానికీ, జగన్ పేరు సీబీఐ ప్రస్తావించక తప్పని పరిస్థితి ఏర్పడడానికీ వివేకా కుమార్తె  సునీత  అలుపెరుగని న్యాయపోరాటమే కారణమని వేరే చెప్పనవసరం లేదు. అసలు సునీత పట్టుబట్టి తన తండ్రి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును సాధించినప్పటి నుంచే వైసీపీ పునాదులు కదలడం ప్రారంభమయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారుల వరకూ దర్యాప్తు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే అధికారం చేపట్టగానే జగన్ సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారన్న విశ్లేషణలు పరిశీలకుల నుంచి వస్తున్నాయి.  

అందుకే పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసీ.. ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇదే కేసులో ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని పట్టించుకోకుండా ఒక్క అవినాష్ రెడ్డి విషయంలోనే జగన్ అతి శ్రద్ధ చూపడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఒక ఎంపీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. ఏ ముఖ్యమంత్రైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లుగా కలగ జేసుకోకుండా ఉంటారని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో సాక్షాత్తూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టైతే కేజ్రీవాల్ ఆ అరెస్టును ఆపడం కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేయలేదనీ, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడలేదనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా జగన్ మాత్రం అవినాష్ కు ఇలా సీబీఐ నోటీసులు అందితే.. అలా హస్తిన  పర్యటనకు వెళుతున్నారనీ, అర్ధరాత్రి సమావేశాలతో  అవినాష్ ను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఆరోపణలు కచ్చితంగా పార్టీపైనా, ప్రభుత్వంపైనా ప్రజలలో వ్యతిరేకతను పెంచుతున్నాయి. ఇక ఇప్పుడు సీబీఐ వివేకా హత్య కేసులో ఏ8గా అవినాష్ రెడ్డిని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఎ9 ఎవరు అన్న చర్చ రాష్ట్రంలో జోరందుకుంది. వివేకా హత్య వెనుక విస్తృత రాజకీయ కోణం, కుట్ర ఉందని కూడా సీబీఐ పేర్కొనడంతో ఇప్పుడు అందరి చూపులూ తాడేపల్లి ప్యాలెస్ వైపు మళ్లడంతో ఎ8 అవినాష్ రెడ్డి అయితే ఎ9 ఎవరన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.  ఆ చర్చలో ఈ కేసులో కీలక సాక్షులైన గంగాధరరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు అనుమానాస్పద స్థితిలో మరణించడం ప్రస్తావనకు వస్తోంది. అలాగే  ఈ కేసు విచారణ ఏపీలో జరుగుతున్న సమయంలో సీబీఐ అధికారులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ప్రస్తావనకు వస్తున్నాయి.