వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు జగన్?
posted on Jun 10, 2023 10:01AM
.webp)
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఆయనను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఆయన బెయిలు కోసం తన కుమారుడు అవినాష్ రెడ్డిలా తెలంగాణ హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించక తప్పదు.
ఆయన ఏ హెల్త్ గ్రౌండ్స్ లో అయితే సీబీఐ కోర్టులో బెయిలు పిటిషన్ వేశారో.. వాటిని కోర్టు పరిగణనలోనికి తీసుకోలేదు. అయితే తన కుమాడురు అవినాష్ రెడ్డికి మాత్రం హైకోర్టు తల్లి అనారోగ్య కారణంగా బెయిలు ఇచ్చింది. దీంతో భాస్కరరెడ్డి కూడా తన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ వేసిన కౌంటర్ అఫిడవిట్ లో భాస్కరరెడ్డి అత్యంత ప్రభావమంతమైన వ్యక్తి అనీ బెయిలు ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారనీ పేర్కొంది. అంతే కాకుండా సాక్షులను బెదరించే అవకాశాలు ఉన్నాయనీ పేర్కొంది.
అలాగే ఈ కేసులో సునీత తరఫు న్యాయవాదులు సైతం తమ వాదనలు వినిపించారు. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న సీబీఐ కోర్టు బెయిలు నిరాకరించింది. కాగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ వాదనల సమయంలో కూడా సీబీఐ, సునీత ఇవే వాదనలు వినిపించారు. అయినా అక్కడ అవినాష్ కు ఊరట లభించింది. దీంతో భాస్కరరెడ్డి బెయిలు కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తారని పరిశీలకులు అంటున్నారు. కాగా అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీంను ఆశ్రయించారు. సునీత పిటిషన్ సుప్రీంలో మంగళవారం (జూన్ 13)న విచారణకు రానుంది. దీంతో అవినాష్ విషయంలో సుప్రీం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉంది. ఆరోగ్య కారణాలు, అయితే ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ కూడా వివేకా హత్య కేసులో అవినాష్ ఏ గ్రౌండ్ మీద అయితే యాంటిసిపేటరీ బెయిలు సంపాదించారో అవే గ్రౌండ్స్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నుంచి మధ్యంతర బెయిలు పొందారు. అయితే ఈడీ రాఘవ బెయిలును సవాల్ చేయడంతో పై కోర్టు మధ్యంతర బెయిలు రద్దు చేసి రాఘవను లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో అవినాష్ కు కూడా అదే పరిస్థితి ఎదురౌతుందని, ఆయన బెయిలు రద్దయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ న్యాయ నిపుణులు అంటున్నారు.
అదలా ఉంచితే.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు సందర్భంగా తెలంగాణ హైకోర్టులోనూ, ఆ తరువాత భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్ సందర్భంగా సీబీఐ కోర్టులోనూ సీబీఐ తన అఫిడవిట్లలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేరును ప్రస్తావించింది. వివేకానందరెడ్డి హత్య విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉదయం 6.15 గంటలకు ముందే తెలుసని సీబీఐ రెండు సందర్భాలలోనూవివేకా పీఏ బయటికి చెప్పకముందే జగన్‌కు తెలుసని దర్యాప్తులో గుర్తించామని పేర్కొంది. దీంతో వివేకా హత్య కేసు దర్యాప్తును అడుగడుగునా అడ్డుకోవడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన ప్రయత్నాలన్నిటినీ వివేకా కుమార్తె వైఎస్ సునీత తన అసమాన న్యాయపోరాటంతో అడ్డుకున్నారని చెప్పాలి. ఈ విషయంలో ఆమె తన సోదరుడు జగన్ పై పై చేయి సాధించారని పరిశీలకులు అంటున్నారు.
ఇక ఇప్పుడు వివేకా హత్య కేసు విషయంలో జగన్ నోరు విప్పక తప్పని పరిస్థితి ఏర్పడిందనీ, సీబీఐ తన అఫిడవిట్లలో జగన్ పేరు ప్రస్తావించడమంటే ఆయనను విచారిస్తామని చెప్పడమేనని న్యాయనిపుణులు కూడా అంటున్నారు. ఏది ఏమైనా వివేకా హత్య కేసులో ఇక అవినాష్ అరెస్టు అనివార్యమని చెబుతున్నారు. అలాగే ఆయన తండ్రి భాస్కరరెడ్డి బెయిలు కోసం హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినా పెద్దగా ఫలితం ఉండదని అంటున్నారు.