ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ?

ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపునకు.. క్రాస్ ఓటింగే కారణమంటూ.. అందుకు సంబంధించి నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితోపాటు ఉండవల్లి శ్రీదేవిపై అధికార ఫ్యాన్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు మీడియా ముందుకు వచ్చి తమదైన శైలిలో స్పందించారు. 

ఇక ఆనం రామనారాయణరెడ్డి అయితే సైకిల్ పార్టీలో చేరేందుకు చాలా కాలంగా వేచి చూస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆయన పార్టీ మారే క్రమంలో క్రాస్ ఓటింగ్ వేయడం ద్వారా టీడీపీ అభ్యర్థిని బలపరిచి ఉంటారని అంతా భావిస్తున్నారు. అంత వరకు బానే ఉంది. కానీ ఇంత తతంగం జరిగినా... జరుగుతున్నా.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాత్రం ఇప్పటి వరకు.. ఈ అంశంపై స్పందించక పోవడం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకొన్న తర్వాత తాడికొండ శ్రీదేవి ఎక్కడా కనిపించడం లేదు.ఆమె అజ్ణాతంలోకి వెళ్లారన్న చర్చ సమాజిక మాధ్యమంలో జోరుగా సాగుతోంది. 

మరోవైపు  క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినది ఈ  నలుగురు ఎమ్మెల్యేలే అని వైసీపీ అధిష్ఠానం ప్రకటించగానే గుంటూరులోని ఎమ్మెల్యే శ్రీదేవి కార్యాలయంపై ఫ్యాన్ పార్టీ శ్రేణులు దాడి చేసి ఆమె ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. శ్రీదేవికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  ఒక వైపు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకొంటుంటే.. కోటంరెడ్డి, మేకపాటి లాగా ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి.. ఏ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని.. తమ పార్టీ సూచించిందో.. ఆ అభ్యర్థికే తాను ఓటు వేశానని... అంతేకానీ.. తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని.. అయితే ఎవరో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి.. తన మీద ఇటువంటి ఆరోపణలు చేసి.. తన రాజకీయ జీవితాన్ని బలి చేస్తున్నారంటూ ప్రకటించే అవకాశం ఉన్నా.. ఎమ్మెల్యే శ్రీదేవి ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు.  

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీకి మరో సమన్వయకర్తగా గతంలో మాజీ మంత్రి డొక్క మాణిక్య వర ప్రసాద్‌ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో డొక్కా నియామకాన్ని శ్రీదేవితో పాటు ఆమె అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలో అప్పటి కప్పుడు అర్థరాత్రి వేళ.. జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌, హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత నివాసానికి చేరుకొని.. ఎమ్మెల్యే శ్రీదేవితోపాటు ఆమె అనుచరులు ఆందోళనకు దిగారు. 

దాంతో వారిని మేకతోటి సుచరిత సముదాయించి.. ఆ తర్వాత ఆ పంచాయతీని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో పెట్టడంతో... ఎమ్మెల్యే శ్రీదేవి తాత్కాలికంగా కూల్ అయ్యారు. ఆ తరువాత కొద్ది రోజులకే.. పార్టీ జిల్లా  ఇన్‌చార్జ్ బాధ్యత నుంచి మేకతోటి సుచరిత తప్పుకోవడంతో.. ఆ బాధ్యతలను సైతం డొక్కా మాణిక్య వర ప్రసాద్‌కు వైసీపీ అధిష్టానం అప్పగించింది. 
 
ఇంకోవైపు తాడికొండ నియోజకవర్గంలో పార్టీ అదనపు సమన్వయ కర్తగా కర్తగా సురేష్ కుమార్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో అతడి ఆధ్వర్యంలోనే స్థానికంగా  వైసీపీ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాలు సైతం కత్తెర సురేష్ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. 

దీంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి ఉత్సవ విగ్రహాంగా మారడంతో.. ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారనే చర్చ సైతం స్థానికంగా  కొనసాగుతోంది. అలాంటి వేళ ఆమె తెలుగుదేశం గూటికి చేరాలని నిర్ణయించుకొని ఉంటారని.. అందులో భాగంగానే ఎమ్మెల్యే శ్రీదేవి తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదీకాక తాడికొండ నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో శ్రీదేవిని కాకుండా మరో  అభ్యర్థిని  బరిలోకి దింపేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నారనీ, ఆ విషయం గ్రహించే శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఉంటారనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి.