వైకాపాలో అసమ్మతి సునామీ?

వైసీపీలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తున్నారు? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే నెపంతో ఏకపక్షంగా నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని  ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, పార్టీ క్యాడర్ ఎలా చూస్తున్నారు? మరీ ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్ గురించి ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ   సామాన్య ప్రజల నుంచి మేథావుల వరకు అందరూ అందరి నోటా వ్యక్తమౌతున్న ఎకాభిప్రాయం  ‘రోజులు దగ్గర పడ్డాయి’ అనే.

పట్టభద్రుల నియోజక వర్గాల్లో వైకాపా ఓటమి, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలలో ఉన్న సొంత పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఉన్న అసంతృప్తిని బహిర్గతం చేసిందని అంటున్నారు. ముఖ్యంగా, వైకాపా ఎమ్మెల్యేలో అసమ్మతి కొత్త వవిషయం కాదు. చాలా కాలంగా  చాలా మంది  ఎమ్మెల్యేలో అసమ్మతి అగ్గి రాగులు తూనే వుంది. భగ్గు మనేందుకు సిద్ధంగా వుంది. అయితే  ఇంతకాలం పిల్లి మేడలో గంట కట్టేదేవరనే దగ్గర ఆగిన అసమ్మతి లావా ప్రవాహానికి  స్వయంగా పార్టీ అధినాయకత్వమే గేట్లు ఎత్తేసింది. పొమ్మన కుండా పొగ పెట్టి  ఆనం రామ నారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని బయటకు పంపిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్రాస్ వోటింగ్ సాకు చూపి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఇక అసమ్మతి కట్టలు  తెంచుకుంటుందన్న పార్టీ లో చర్చ మొదలైంది. 

ఈ నేపథ్యంలోనే  వైసీపీలో  చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని సస్పెన్షన్‌కు గురైన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు బహిరంగంగానే బయటికి వస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో చాలా మంది లోలోపల ఉడికిపోతున్నారని చెప్పారు. మరో పార్టీలో చేరిక కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

2024 ఎన్నికలలో ఎవరికి ఓటేయాలన్న విషయంలో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీ శాశ్వతంగా డిస్మిస్‌( సస్పెండ్) అవుతుందని జోస్యం చెప్పారు. 2024లో రాజకీయ ప్రజా సునామీ రాబోతోందని.. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమే స్పష్టమైన ప్రజా తీర్పు అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలనే తపన ఉన్న తాను.. విసిగి వేసారి చివరికి గట్టిగా మాట్లాడానని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. చివరికి పార్టీ (వైసీపీ)కి విధేయుడిగా ఉన్న తనపైనే నిఘా పెట్టారన్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే అనుమానించారని.. పరిష్కరించకుండా రాజకీయ కోణంలో ఆలోచించారని చెప్పారు. 

అదలా ఉంటే, కడప మొదలు ప్రతి జిల్లాలోనూ, వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు,కార్యకర్తలు జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా నిట్టనిలువుగా చీలిపోయారని అంటున్నారు. అక్కడక్కడా రహస్య సమావేశాలు జరుగుతున్న  సమాచారం కూడా పార్టీ పెద్దలకు చేరుతోందని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల ప్రతి కదలిక పైనా ఒకరికి తెలియకుండా మరొకరిని నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

దీంతో పార్టీలో ఒకరిని ఒకరు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని, చివరకు మంత్రులు కూడా రాజకీయాల గురించి మాట్లాడేందుకు జంకుతున్నారని అంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే నిజంగానే కోటంరెడ్డి అన్నట్లుగా  వైసీపీని అసమ్మతి సునామీ ముంచేసేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.