కేసీఆర్ సర్కార్ కు లీకేజీ చిక్కులు

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానని హ్యాండిల్  చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందా? అంటే అవుననే అంటున్నారు  రాజకీయ విశ్లేషకులు. నిజానికి, రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాదు అధికార బీఆర్ఎస్ నాయకులు కూడా అదే మాట అంటున్నారు.ఎనిమిదేళ్ళ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ ఒకెత్తు అయితే, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం చేసిన తప్పు ఒక్కటీ ఒకెత్తని బీఆర్ఎస్ నాయకులే వాపోతున్నారు. అంతేకాదు ఇప్పటికైనా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే  రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు. 

ముఖ్యంగా అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) విచారణ ఎదుర్కోవలసి రావడంతో, ముఖ్యంత్రి టీఎస్పీఎస్సీ లీకేజీపై దృష్టి పెట్టలేదనీ, అందువలన  లీకేజీ వ్యవహారం కోతి పుండు బ్రహ్మరాక్షసి చందంగా మరింత జటిలంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నేతలు అంటున్నారు. అలాగే  మంత్రి కేటీఆర్ లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడిన సమస్యతో తమకు సంబంధం లేదన్న విధంగా మాట్లాడడంతో విద్యార్ధులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని అంటున్నారు. మళ్ళీ పరీక్షలు రాయండి అన్నం పెడతాం, ఫీజులు కడతాం అంటూ నిరుద్యోగులను అవమానపరిచే విధంగా మాట్లాడడం కూడా విద్యార్థుల ఆగ్రహానికి కారణం అవుతోందని అంటున్నారు.

కొందరు నిరుద్యోగ యువకులు భౌతిక దాడులకు సైతం వెనుకాడమని హెచ్చరిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోందని అంటున్నారు. ఒక విధంగా సున్నితంగా పరిష్కరించవలసిన సమస్యను ప్రభుత్వ పెద్దల ధోరణి వలన జటిలం అయిందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.  అలాగే  ‘సిట్’ విచారణలో  టీఎస్సీఎస్సీ నిర్వాకం బయట పడిందని,  తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన, ‘నియామకాలు’ విషయంలో ప్రభుత్వం డొల్లతనం బయట పడిందని అంటున్నారు. ఒక విధంగా, టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల విషయంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వమే ఆయుధాన్ని అందించిందనే అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాలలోనే వినవస్తోంది. 

అదలా ఉంటే, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఇదే విషయంగా పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ,రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బీజేపీ, శనివారం(మార్చి 25) నిరుద్యోగ మహాధర్నా నిర్వహించింది. గ్రూప్ వన్  పరీక్షల పేపర్‌ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్‌ అంధకారంలో పడిన నేపథ్యంలో వారి తరపున పోరాడేందుకు పార్టీ దశల వారీ ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో ఇందిరాపార్క్‌ వద్ద వేలాది మందితో ‘మా కొలువులు మాగ్గావాలే’ అనే నినాదంతో,   నిరుద్యోగ మహాధర్నా నిర్వహించారు.

 కాగా  నిరుద్యోగ మహాధర్నా బీజేపీకే పరిమితమైన కార్యక్రమం కాదని, 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్ కు ముడిపడి ఉన్న సమస్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. వారందరికీ అండగా ఉంటామని, కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేసేవరకూ వదలిపెట్టబోమని తేల్చి చెప్పారు. టీఎస్పీఎస్పీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్‌ పాత్ర లేదని సీఎం కేసీఆర్‌ భావిస్తే తక్షణం, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి ఆధ్వర్యంలో విచారణను కోరాలని, సకాలంలో పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలని అన్నారు. తన కుమారుడి ప్రమేయాన్ని ఖండించని కేసీఆర్  రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు లక్షలాది మంది నిరుద్యోగులు, వారి కుటుంబాలను అంధకారంలోకి నెట్టడం కేసీఆర్‌ దుర్మార్గ చర్యలకు పరాకాష్ఠ  అని విమర్శించారు.

అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్ళీ మరోమారు, ఉద్యమం నాటి, వాతావరణం కనిపిస్తోందిని అంటున్నారు.  రెండు రోజుల కిందట వివిధ విద్యార్ధి సంఘాలు సంయుక్తంగా నిరుద్యోగ దీక్ష, ర్యాలీ నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలను పోలేసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందల మంది విధ్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే  దీక్షలో పాల్గొనేందుకు సిద్దమైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యు నాయకులను ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ చేశారు.  మరో వంక ఏప్రిల్ రెండవ వారంలో లక్షమందితో నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని  సమస్య పరిష్కారానికి కృషి చేయాలని  లేదంటే  రాజకీయంగా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని, బీఆరేస్ నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.