విశాఖ మరో ఏలూరు కానుందా?..

ఏలూరు వాసులను ఇటీవల అంతుచిక్కని వ్యాధి వణికించిన సంగతి తెలిసిందే. కళ్లు తిరిగి పడిపోవడం, నోటి నుంచి నురగ, తలపోటు తదితర లక్షణాలతో 600 మందికి పైగా ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. అయితే, నీటి కాలుష్యమే ఈ వింత వ్యాధికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, నీటి కాలుష్యాన్ని నివారించకపోతే ఏలూరులో ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లుగా.. విశాఖలోనూ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందన్న ఆందోళన కనిపిస్తోంది.

 

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తరువాత విశాఖ వాసుల్లో భయం మొదలైంది. క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చేసిన అధ్యయనం ప్రకారం నీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉన్న నగరాల్లో విశాఖ ఒకటి. మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) ద్వారా సరఫరా అవుతున్న నీరు అనేక చోట్ల కలుషితమవుతోందని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. విశాఖలో పారిశ్రామిక కాలుష్యం, నీటి సరఫరా లైన్లు డ్రైనేజీల మధ్య ఉండటం, వ్యర్థాలు రిజర్వాయర్లలోకి వదలడం వల్ల నీరు కలుషితమవుతోంది.

 

ముఖ్యంగా మేఘాద్రిగెడ్డలో పెరుగుతున్న నీటి కాలుష్యం విశాఖవాసులను ఆందోళన కలిగిస్తోంది. విశాఖ వాసుల నీటి అవసరాలకు ఏలేరు, మేఘాద్రి గెడ్డ, ముడసరలోవ, రైవాడ, తాటిపూడి, గంభీరం రిజర్వాయర్లే ఆధారం. అయితే, మేఘాద్రి గెడ్డ రిజర్వాయరులో వ్యర్థాలు చేరుతున్నాయి. పెందుర్తి, సబ్బవరం, నవర ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలతో కూడిన నీరే ఎక్కువ శాతం ఈ రిజర్వాయర్ కు చేరుతుంది. ఈ నేపథ్యంలో మేఘాద్రిగెడ్డలో పెరుగుతున్న నీటి కాలుష్యం కలవరపెడుతోంది. 

 

మరోవైపు భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీరూ ఇందులోకే తెచ్చి ఇతర రిజర్వాయర్లకు తీసుకెళ్లే ప్రణాళికా నడుస్తోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిండంతో నగర విస్తరణ జరిగే అవకాశముంది. దీంతో, భవిష్యత్తు అవసరాల కోసం నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా, పోలవరం నుంచి గోదావరి జలాలను విశాఖకు తరలించి.. మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో నిల్వ ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే, మేఘాద్రిగెడ్డలో పెరుగుతున్న కాలుష్యం నగరవాసులను కలవరపెడుతోంది. ఇప్పటికైనా, సరైన చర్యలు చేపట్టకపోతే విశాఖ మరో ఏలూరు అయ్యే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu