ఆ 18 మంది జవాన్లు బలి కాకుంటే..

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన పుల్గావ్‌ ఆయుధాగారంలో సంభవించిన ఘోర ప్రమాదంలో 18 మంది జవాన్లు బూడిద కుప్పగా మారారు. వీరిలో ఇద్దరు అధికారులతో పాటు 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా ప్రమాదంలో మరణించిన వారు కాదు..ఆ ప్రమాదం మరింత పెద్దది కాకుండా చేసే ప్రయత్నంలో మరణించినవారు. పుల్గావ్ ఆయుధాగారం భారత్‌లోనే అతిపెద్దది. నాగ్‌పూర్‌కు 115 కి.మీల దూరంలో ఉన్న ఈ కేంద్రం భారతసైన్యానికి అత్యంత ముఖ్యమైన ఆయుధాగారాల్లో ఇది ప్రత్యేకం. దీంట్లో  ఏకే 47లు, బ్రహ్మోస్ క్షిపణులు, గ్రెనేడ్లు, బాంబుల వంటి శక్తివంతమైన ఆయుధాలు నిల్వ ఉంచుతారు. దేశవ్యాప్తంగా వివిధ ఆయుధ కర్మాగారాల్లో తయారైన ఉత్పత్తులను ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు పంపిణీ చేస్తారు. ఏడువేలకు పైగా ఎకరాల్లో  విస్తరించి ఉన్న ఈ ఆయుధాగారంలో మొత్తం పది షెడ్లు ఉంటాయి.

 

సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత అత్యంత సున్నితమైన మందుగుండు సామాగ్రి ఉన్న ఒక షెడ్డులో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఒకదాని తర్వాత ఒకటిగా అనేక వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పేలుడు ఘటనలో మోటర్ షెల్స్, స్లింటర్స్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలపై వర్షం కురిసినట్టు పడ్డాయి. అర్థరాత్రి దాటిన తర్వాత..జనం గాఢనిద్రలోకి జారుకుంటున్న వేళ బాంబుల మోతతో ఏం జరుగుతోందో తెలియక ఆయా గ్రామాల ప్రజలు ప్రాణాలరచేత బట్టుకుని బయటకు పరుగులు తీశారు. భూకంపం వచ్చిందా..? ప్రళయం ముంచుకొచ్చిందా అన్నంత తీవ్రమైన శబ్ధాలతో పేలుళ్లు సంభివించడంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు భయాందోళనలకు గురయ్యారు.

 

నెమ్మదిగా మంటలు ఇతర షెడ్డుల్లోకి వ్యాపించడాన్ని పసిగట్టిన సైనికులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, క్విక్ రియాక్షన్ టీమ్‌లు వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. మరోవైపు ఎగిసిపడుతున్న మంటల నుంచి విలువైన ఆయుధసంపత్తిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో సైనికాధికారులు లెఫ్టినెంట్ కల్నల్ ఆర్.ఎస్.పవార్, మేజర్ మనోజ్ కుమార్ మృత్యువాతపడ్డారు. ఈ ప్రయత్నంలో మరో 16 మంది జవాన్లు కన్నుమూశారు.

 

ప్రాణాలను పణంగా పెట్టి వీరు చేసిన ప్రయత్నాల వల్లే మంటలు ఇతర షెడ్లకు వ్యాపించలేదు. రెప్పపాటులో ప్రాణాలు పోతాయని తెలిస్తే మనిషి అటువైపు వెళ్లడు. కాని చెవులు సైతం చిల్లులు పడే శబ్థాలొస్తున్న సమయంలో..మృత్యుదేవత తన పంజా విసరడానికి సిద్థంగా ఉన్న తరుణంలో దేశ రక్షణే పరమావధిగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సైన్యానికి ఈ మంటలు ఎక్కువైతే ఏం జరుగుతుందో బాగా తెలుసు, అంతే ఏ మాత్రం ఆలోచించకుండా మంటల్లో దూకారు. వారు తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి చూసుంటే భారతదేశ పటంలో మహారాష్ట్ర మాయమైపోయేది. ఎందుకంటే మంటలు వ్యాపించిన షెడ్డును అనుకుని ఉన్న షెడ్డులో క్షణాల్లో ఒక దేశాన్ని నాశనం చేయగల "బ్రహ్మోస్" వంటి క్షిపణులు నిల్వ చేసి ఉన్నాయి. ఏ మాత్రం అటు ఇటైనా జరిగే నష్టం ఊహకు కూడా అందదు. ఆ 18 మంది జవాన్ల బలిదానం కారణంగా మహా విధ్వంసం త్రుటిలో తప్పిపోయింది. దేశరక్షణ కంటే సైనికులకు ఏది ఎక్కువ కాదనడానికి ఇదోక నిదర్శనం. ఈ సందర్భంగా ఆ అమరులకు నివాళులర్పిద్దాం..జై హింద్.