ప్రాణానికి "పొగ" సెగలు...
posted on May 31, 2016 11:32AM

చూడటానికి అది చేతి వ్రేలంత లేని చిన్న కాగితపు గొట్టం..కాని దానిని పట్టుకున్న వాడికి తెలియదు ఆ గొట్టంలోంచే ప్రాణం పోతుందని. అది తనతో పాటు ఇంటిని కబళలిస్తుందని. చుట్ట, బీడీ, హుక్కా ఇలా తన భిన్న రూపాలతో పొగాకు మనిషి ప్రాణాన్ని హరించేస్తోంది. నేడు"ప్రపంచ నో టొబాకో డే"సందర్భంగా పొగాకు దుష్పరిణామాలపై అవగాహన కోసం ప్రత్యేక కథనం
పొగ అన్న పదానికి మన పురాణాలు, శాస్త్రాలు పవిత్రతను ఆపాదించాయి. ఎందుకంటే యజ్ఞాలు, యాగాలు జరిగేటప్పుడు హోమగుండంలోంచి వెలువడే పొగకు శక్తి ఉంటుందని దానిని పిలిస్తే ఆరోగ్యానికి మంచిదని మన పూర్వీకులు విశ్వసించారు. కాని భారతదేశంలోకి పోర్చుగీసు వారి రాకతో పొగాకు అనేది మనదేశంలోకి అడుగుపెట్టింది. ఈ ధూమపానం తరతరాలుగా మనతో పాటే వస్తుంది. తండ్రికి సిగరెట్ తాగే అలవాటు ఉంటే పిల్లలకు కూడా అలవాటయ్యే అవకాశాలెక్కువ. పొగాకు అలవాటయ్యేలా ప్రోత్సహిస్తున్నది నికొటిన్. రుచికరమైన వంటకం మళ్లీ మళ్లీ తినాలని ఎలా కోరుకుంటామో సిగరెట్ కూడా అలాంటిదే. పొగ పీల్చగానే..నికొటిన్ ఊపిరితిత్తుల నుంచి చాలా వేగంగా రక్తంలో కలిసి, 10-16 సెకన్లలోనే మెదడును చేరుతుంది. వెంటనే శరీరానికి కొత్త ఉత్సాహం ఆవరించినట్లుంటుంది. అయితే ఈ నికొటిన్ ఒంట్లో ఎక్కువసేపుండదు. దీంతో మళ్లీ నికొటిన్ కోసం తహతహ, సిగరెట్ తాగాలన్న కాంక్ష బయల్దేరతాయి. దీంతో ఏ పనిలో ఉన్నా పక్కన పెట్టి పొగ కోసం వెదుక్కుంటారు. ఈ విధంగానే మనిషి పొగాకుకు బానిసవుతాడు.
చిన్నపుడు తండ్రిని చూస్తూ పెరగడం..యవ్వనంలో స్నేహితుల వల్ల ఒకసారి పొగ తాగి చుద్దామన్న ఆసక్తి రేగుతుంది. నేటి యువతకు పొగ తాగడం ఒక ఫ్యాషన్. పొగ తాగడం వల్ల ఎలాంటి కీడు జరుగుతుందో తెలిసి కూడా తక్కువగా తాగితే ఏ ప్రమాదం లేదని భావించడం వల్ల తాగుతున్నవారు ఎక్కువ. పొగ తాగినప్పుడు అది మన వూపిరితిత్తుల్లోకి మాత్రమే వెళుతుందని, దీంతో మహా అయితే దగ్గు వస్తుందనీ చాలా మంది భావిస్తుంటారు. కాని ఇది పెద్ద అపోహ. ఊపిరితిత్తుల్లోకి వెళ్లే పొగ అక్కడి నుంచి రక్తంలో కలిసి శరీరంలోని ప్రతీ అవయవాన్నీ చేరి లోలోపలి దేహాన్ని నిర్వీర్యం చేస్తుంది. మనం కళ్లు తెరిచే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీని వల్ల గుండెపోటు, అల్సర్లు, చర్మ సంబంధ సమస్యలు, ఎముకలు పెళుసుగా మారడం, క్షయ, నోటీ, గొంతు క్యాన్సర్, వినికిడి, చూపు కోల్పోవడం, సంతానలేమి ఇలా టాప్ టూ బాటమ్ శరీరం మొత్తంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుంది పొగ.
ప్రపంచం సంగతి ఎలా ఉన్నా పొగాకు వినియోగంలో ఇండియా మూడోస్థానంలో ఉంది. రానున్న కాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉండటంతో 2020 నాటికి దేశంలో భారీ ధూమపాన మరణాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవడి జీవితం వాడి ఇష్టం ఎమైనా చేసుకోవచ్చు. కాని పక్కవాడి ప్రాణాన్ని తీసే హక్కు మాత్రం ఎవరికి లేదు. పొగతాగే వారి కంటే దానిని పీల్చేవారికే ఎక్కువ ప్రమాదకరం. పొగ తాగిన వ్యక్తి విడిచిన పొగ ఆ పరిసర ప్రాంతమంతా పొగ అవరిస్తుంది. ఇది నేరుగా వారి శరీరాల్లోకి వెళ్లి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.
ప్రభుత్వం పొగాకు వినియోగంపై అనేక కఠినమైన చట్టాలు తీసుకువచ్చినప్పటికి ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. 18 ఏళ్లలోపు పిల్లలు పొగతాగరాదని, వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదని నిబంధనలు ఉన్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు హుక్కాను నిషేధించాయి. ఆ మధ్య సిగెరెట్లను లూజ్ సెల్స్ అమ్మరాదని..ప్యాకెట్లతోనే అమ్మాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ ప్రయోగం ఆశించినంత స్థాయిలో విజయవంతం కాలేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా సిగరెట్ మానడం..మానకపోవడం మన చేతుల్లోనే ఉంటుంది. మీరు పొగే కదా అని తేలిగ్గా అనుకోకండి..మీ మీదే ఆశలు పెట్టుకుని జీవించే మీ కుటుంబం గురించి..మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించండి. సంకల్పంతో ఈ మహమ్మారి నుంచి బయటపడండి.