బంగారు తెలంగాణ సాధన దిశగా...

 

తరతరాలుగా సొంత రాష్ట్రం కోసం..స్వపరిపాలన కోసం అస్థిత్వ పోరాటం సాగించిన అనంతరం సాకారమైన 60 ఏళ్ల కల తెలంగాణ వచ్చిన రోజు..అదే జూన్..2. ఇది ఎవరి ఘనతా కాదు..యావత్తు తెలంగాణసాగించిన అపూర్వ పోరాటాల ఫలం..రాష్ట్ర ఏర్పాటును ఓ అనివార్యతగా మార్చేసిన అద్భుతమైన ప్రజాపోరు. నీళ్లు, నిధులు, నియామకాలు, యాస, సంస్కృతుల కోసం సాగించిన అద్వీతీయ ప్రజాందోళన ఇది. నెత్తుటి చుక్క చిందకుండా ఓ లక్ష్యం ముద్దాడిన చరిత్ర ఇది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ మూడో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఆ సమయంలో తెలంగాణ నినాదాన్ని భుజానికెత్తుకున్న టీఆర్ఎస్‌ పార్టీనే ప్రజలు నమ్మారు. ఉద్యమనాయకుడే..తొలి ప్రభుత్వాధినేత అయ్యారు. ఉద్యమ నాయకుడిగా జనాన్ని నడిపించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలనలోనూ సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. అన్నీ తానై దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో..వారి ఆశలు, ఆకాంక్షలేమిటో తెలిసిన నాయకుడిగా సంక్షేమ
పథకాలకు రూపకల్పన చేశారు.

 

చిన్న రాష్ట్రం ఎన్నటికీ కుదురుకోలేదని..విడిపోతే వికలమైపోతుందనీ..శాంతి భద్రతల నుంచి కరెంట్ కష్టాల వరకు సమస్యలు చుట్టుముట్టి రాష్ట్రంగా మనగలగడమే కష్టమన్న స్థితి నుంచి రాష్ట్రమంటే ఇలా ఉండాలి అనేంతగా కేసీఆర్‌ తెలంగాణను నడిపిస్తున్నారు.  రాష్ట్ర భవిష్యత్‌కు బంగారు బాటలు వెయ్యటంలో పరిణితి చెందిన వ్యక్తిగా రాణిస్తున్నారు. అటు రాజకీయంగానూ, ఇటు పరిపాలనాపరంగానూ తనకు ఎదురులేకుండా చూసుకుంటున్నారు. తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చే శక్తి తాగునీరు, సాగునీరుల్లోనే ఉన్నాయని గ్రహించిన గులాబీ దళపతి ఆ దిశగా భారీ బాధ్యతలను నెత్తుకున్నారు. కాకతీయుల కాలంలో కీలకభూమిక పోషించిన చెరువులకు తిరిగి జవజీవాలనివ్వాలనే లక్ష్యంతో మిషన్ కాకతీయ పేరుతో మళ్లీ చెరువులకు పునర్వైభవాన్ని కల్పించేందుకు కష్టపడుతున్నారు. ఈ సారి వర్షాలు సాధారణ స్థాయిలో కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాల నేపథ్యంలో చెరువులన్నీ జలకళను సంతరించుకోనున్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరును అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌ను చేపట్టారు కేసీఆర్. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీళ్లు అందించి ఏ ఆడబిడ్డా నీటి కోసం నెత్తిన బిందె పెట్టుకుని రోడ్డెక్కకూడదన్నది ముఖ్యమంత్రి ఆశయం.

 

ఐడీహెచ్‌ కాలనీలో పర్యటించిన వేళ పేదవాడి గూడును చూసి చలించిన కేసీఆర్ బడుగుజీవి ఆత్మగౌరవంతో బతకాలని ఆకాంక్షించారు. అందుకే డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టించి ఉచితంగా అందజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశంపై దృష్టి కేంద్రీకరించి చర్యలు తీసుకున్నారు కేసీఆర్. కొత్త పెట్రోలింగ్ వాహనాలు అందజేసి నేరాల అదుపుకు కృషిచేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా పోలీసులకు , ప్రజలకు మధ్య వారధిగా నిలిచారు. త్వరలో అగ్రరాజ్యాలతో పోటీపడేలా కమాండ్ కంట్రోల్ నిర్మించేందుకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆసరా  ఫించన్ల ద్వారా వృద్ధులు, వికలాంగుల కళ్లలో వెలుగులు నింపారు. పేదింటి ఆడపిల్లలకు పెళ్లి చేయ్యాలంటే ఈ రోజుల్లో సాధ్యమయ్యే పనికాదు. అందుకే ఎస్సీ, ఎస్టీ, మైనారిటి యువతుల సంక్షేమం కోసం షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ పథకాల ద్వారా పేద తల్లిదండ్రుల భారం తనదిగా భావించి తండ్రిగా మారారు. శిశు మరణాల రేటును తగ్గించేందుకు కేసీఆర్ నడుం బిగించారు. గతంలో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు 38 మరణాలుగా ఉండగా ఇప్పుడది 28కి తగ్గింది. రాష్ట్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి ప్రారంభించింది.

 

హాస్టల్‌లో చదువుకునే విద్యార్థులకు ఇది వరకు ముక్కిపోయిన బియ్యం, రేషన్ బియ్యాన్ని భోజనంగా పెట్టేవారు. కాని కేసీఆర్ ఈ పరిస్థితిని మార్చాలనుకున్నారు. నా మనవడు ఏ బియ్యం తింటాడో అదే బియ్యం హాస్టల్ బిడ్డలకు పెట్టాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా సన్నబియ్యంతో హాస్టల్ విద్యార్థులకు అన్నం పెట్టిన ఘనత దక్కించుకుంది తెలంగాణ. ఏ రాష్ట్రానికైనా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలాంటివి. సంక్షేమాన్ని విజయవంతంగా అమలు చేసిన కేసీఆర్ ఆర్థికాభివృద్ధిపైనా దృష్టిపెట్టారు. తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్‌కు రావాల్సిన వివిధ సంస్థలు, ఇక్కడున్న పరిస్థితితో ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిపోయాయి. మళ్లీ ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు ఉపాధి కల్పన లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌కు రూపకల్పన చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 2014 నవంబర్ 27న టీఎస్ ఐపాస్‌కు చట్టబద్ధత కల్పించారు. దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ ఇచ్చేలా సింగిల్ విండ్ విధానాన్ని బలోపేతం చేస్తూ నూతన విధానాన్ని ప్రతిపాదించారు. ఈ విధానం ద్వారా ఇప్పటి వరకు రూ.35 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

 

వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు టీ-హబ్ పేరిట దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌కు కేసీఆర్ రూపకల్పన చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో పర్యటించి అక్కడి పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరిపి వారిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవిధంగా ఒప్పించారు. ఆయన కృషి ఫలితంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి ఐటీ దిగ్గజాలు తమ కార్యకలాపాలకు కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాయి. పాలనలో టెక్నాలజీకి పెద్ద పీట వేస్తూ ఫైబర్ గ్రిడ్, రాష్ట్ర వ్యాప్తంగా 4జీ సేవలు, ముఖ్య నగరాల్లో వైఫై సేవలు, ఈ-గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో కంప్యూటర్ విద్య తదితరాలకు పెద్దపీట వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమ నినాదంలో అత్యంత కీలకమైన నియామకాలపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో, జెన్‌కోలతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు. ఈ ఏడాది మరి కొన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు ఆదేశాలిచ్చారు.

 

మరోపక్క చాలి చాలని జీతాలతో బతుకు బండిని ఈడుస్తున్న ప్రభుత్వోద్యోగులకు భారీగా ఫిట్‌మెంట్ పెంచి వారి జీతాలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానం చేశారు. తెలంగాణ వస్తే అంధకారమవుతుందనే అపోహల్ని పటాపంచలు చేసేందుకు కేసీఆర్ తన తొలి ప్రాథాన్యతను విద్యుత్ రంగానికే ఇచ్చారు. కొత్త ప్రాజెక్ట్‌లు, విద్యుత్ కొనుగోళ్లతో రాష్ట్రానికి నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నారు. ఇలా ప్రతీ రంగంలోనూ కేసీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తూ బంగారు తెలంగాణ  సాధన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆయన కృషి ఫలించాలని ఆకాంక్షిస్తూ..తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.