స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు చుక్కపడుతుందా?

స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవాలకు చెల్లు చీటీ పాడే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తున్నది. ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ. లోకల్ బాడీ ఎన్నికలలో ఏకగ్రీవాలకు తావులేదని చెబుతూ ఎన్నికలు జరిగి తీరాల్సిందేనంటూ ఓ నివేదిక రూపొందించింది. పంచాయతీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక నామినేషన్ దాఖలైన స్థానానికి కూడా ఎన్నికలు జరగాలనీ, అలాంటి స్థానాల్లో నోటా పోటీదారుగా ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమౌతున్న వేళ  రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదన సంచలనం సృష్టిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ మందబలంతో ప్రోత్సాహకాల పేరిట ఏకగ్రీవాలకు తెరతీయడంతో స్థానిక ప్రభుత్వం (లోకల్ గవర్నెన్స్) లక్ష్యానికి గండిపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే స్థానిక ఎన్నికలు అనగానే మెజారిటీ స్థానాలలో ఏకగ్రీవాలే ఉంటాయి. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలవైపే పార్టీలు మొగ్గు చూపుతాయి. సహజంగానే ఈ ఏకగ్రీవాలలో అత్యధికం అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. 2019 ఎన్నికల్లో 16 శాతం గ్రామాల్లో సర్పంచ్​ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయంటే పరిస్థితి ఇట్టే అర్థం అవుతుంది. అ
వాస్తవానికి పంచాయ‌‌తీ ఎన్నికల్లో  ఏకగ్రీవాలకు తావులేకుండా ఎన్నిక‌‌లు నిర్వహించాలని రాష్ట్ర ఎన్ని క‌‌ల సంఘం ఇప్పటికే ప్రతిపాదనలు రెడీ చేసింది.  రైట్ నాట్​ టు ఓట్’ ప్రకారం అభ్యర్థి నచ్చకుంటే  నోటాను ఎంచుకునే హ‌‌క్కు ఓటరుకు ఉంటుంది. కానీ ఏకగ్రీవాల వల్ల నోటాను ఎంచుకునే హక్కును ఓటర్ కోల్పోతున్నాడు. దీనిపై  ఫోరం ఫర్​గుడ్​గవర్నెన్స్  ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. 

ప్రతి పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని, అభ్యర్థి నచ్చకపోతే నోటాను ఎంచుకునే హక్కు ప్రతి ఓటరుకు కల్పించాలని, ఆ హక్కును కాపాడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆ లేఖలో కోరింది. అందుకే ఒక్క నామినేషన్​వచ్చినా, నామినేష‌‌న్ల ఉపసంహరణ తర్వాత ఒక్క నామినేషన్​మాత్రమే మిగిలినా.. ఏకగ్రీవానికి తావులేకుండా నోటాను  అభ్యర్థిగా ఉంచి,  ఓటింగ్ పెట్టాలన్నది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్.  దీనికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఒక నివేదిక తయారు చేసింది.  ఈ నివేదికపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 23న రాజకీయ పార్టీలతో చర్చించనుంది. ఒక వేళ రాజకీయ పార్టీలు ఇందుకు అనుమతి ఇచ్చినా, రాష్ట్రప్రభుత్వం కూడా అంగీకరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ వర్గాలకు పంచాయతీల ఏకగ్రీవానికి ప్రయత్నించాలంటూ స్పష్టమైన సూచనలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu