స్టీల్ ప్లాంట్ భూములపై లోకేష్ క్లారిటీ
posted on Jan 7, 2026 8:39PM
.webp)
విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. ఈ స్టీల్ ప్లాంట్ భూములు విషయంలో ఎవరైనా స్టేట్‌మెంట్ ఇచ్చారా? అని విలేకర్లను ఆయన సూటిగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ భూములను వాటి అవసరాలకు తప్ప, మరే ఇతర అవసరాలకు వినియోగించ లేదని.. వినియోగించబోమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్టాంట్ లాభాల బాటలో నడవాలని.. అందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపునిచ్చారు.
బుధవారం విశాఖపట్నంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ కోసం ఎవరూ పోరాటాలు చేయడం లేదని లోకేశ్ పేర్కొన్నారు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ పోర్టు ఎందుకని గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో జీఎంఆర్‌కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఆ భూములను జీఎంఆర్‌కు కేటాయించామని వివరించారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ కావాలంటే తీసుకోవచ్చంటూ వైసీపీ వాళ్లకు లోకేశ్ సూచించారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్ రాజా బ్యాటరీస్ వెళ్లగొట్టిడం, పీపీలు రద్దు, పలు కంపెనీలను రాష్ట్రం నుంచి పంపేయడం, ఆఫీస్ అద్దాలు పగలగొట్టడం వంటి సంఘటనల క్రెడిట్ అంతా వైసీపీకే దక్కుతుందని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకటి రెండు నెలల్లో విశాఖపట్నం వేదికగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభమవుతాయని లోకేశ్ చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు కనెక్టింగ్ రోడ్లపై దృష్టి సారించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క 108 వాహనం ఆగలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా 108 వాహనాలు ఆగిపోయాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు