ఏపీలో వాహనదారులకు భారీ షాక్!.. హైకోర్టు చెప్పింది సరే సామాన్యుడు పరిస్థితి ఏంటి?
posted on Mar 1, 2025 1:37PM

ఏపీలో వాహనదారులకు పోలీసు శాఖ షాకిచ్చింది. మోటారు వాహనాల చట్టం అమల్లో ఉన్నప్పటికీ అందులో నిబంధనల్ని పాటించకుండా యథేచ్ఛగా రహదారులపై వాహనాలు నడుపుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చూపిస్తున్నారు. దీంతో ఇక నుంచి ఏపీలో వాహనాలు నడిపేవారు ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ సహా అన్ని పత్రాలు, హెల్మెట్ తీసుకుని వెళ్లాల్సిందే.
రాష్ట్రంలో రహదారులపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు, లారీలు, ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లపై మోటారు వాహన చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటివరకూ నిబంధనలపై అవగాహన కల్పించామని, రేపటి నుంచి భారీ జరిమానాలు తప్పవని పోలీసులు ప్రకటించారు. అంతే కాదు ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధిస్తారో కూడా వివరాలు వెల్లడించారు.
దీని ప్రకారం హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే వారితో పాటు వెనుక సీట్లో కూర్చొన్న వారికి సైతం వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే మొదటిసారి 2 వేలు, రెండోసారి 4 వేలు జరిమానా విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే 1500 జరిమానా ఉంటుంది. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ వాడితే తొలిసారి 1500, రెండోసారి 10 వేలు జరిమానా విధిస్తారు.
ఆటోవాలాలు యూనిఫాం లేకుండా వాహనం నడిపితే తొలిసారి 150, రెండోసారి 300 జరిమానా విధిస్తారు. వాహనాలు రిజిస్ట్రేషన్ లేకుండా, ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోకుండా నడిపితే తొలిసారి 2 వేలు, రెండోసారి 5 వేలు జరిమానా విధిస్తారు. అతి వేగంగా వాహనం నడిపితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే వెయ్యి రూపాయలు జరిమానా ఉంటుంది. వాహనాల రేసింగ్, వేగం పెంచే ప్రయత్నాలు చేస్తే తొలిసారి 5 వేలు, రెండోసారి 10వేలు జరిమానా విధిస్తారు.
హైకోర్టు చెప్పింది. పోలీసులు పని చేయడం మొదలు పెట్టారు. మరి హైకోర్టు చెప్పేవరకూ పోలీసులు ఏం చేసినట్టు.సరే ఈ విషయం కాస్త ప్రక్కన పెట్టి ఆలోచిద్దాం. ట్రాఫిక్ పోలీసులు మార్చి 1 నుంచి ట్రాఫిక్ జరిమానాలు ప్రకటించారు.అసలు సామాన్య, మధ్యతరగతి ప్రజలు వీటిని చెల్లించగలరా. పోలీసు అధికారులు ఒక్కసారి ప్రజల స్థానంలో ఉండి ఆలోచించండి. నిజమే మీ ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉండాలి.అప్పుడే క్రమశిక్షణ ఉంటుంది అనేది మీ భావన. కానీ సామాన్య,మధ్యతరగతి ప్రజలు మీరు విధించే జరిమానా కట్టగలిగే స్థోమత లో ఉన్నారా? లేదా? ప్రభుత్వం చెప్పినట్టు ప్రజల సగటు ఆదాయం 2 లక్షలు అనుకొనే భ్రమలో ఇంతంత జరిమానాలు విధిస్తున్నారా? ఈ రోజు ప్రతి ఒక్కరికి ద్విచక్రవాహనం అవసరం. కానీ అదే సమయంలో పోలీసులు పేర్కొన్న వాటిల్లో ఎదో ఒకటి ప్రతి ఒక్కరి దగ్గర ఉండదు. అలాంటప్పుడు ప్రతి ఒక్కరు జరిమానా ఎదో రూపంలో కట్టాల్సిందే. హైకోర్టు హెల్మెట్ అలవాటు చేయమని చెప్పింది. ఇంత భారీగా జరిమానాలు వేయమని ఎక్కడా చెప్పలేదు. అలా అని మనం సింగపూర్ లో కూడా లేము. నిబంధనలు పెట్టి జరిమానా విధించడానికి. సింగపూర్ లాంటి చోట్ల ప్రజల ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆ దేశం నిర్మాణం నుంచి అన్ని విషయాల్లో క్రమశిక్షణ తో మొదలైంది. మన దేశం, మన రాష్ట్రాలు అలా కాదు. వెనుకబాటుతో ప్రారంభం అయ్యాయి. నేటికీ ప్రజల జీవితాలు గొప్పగా లేవు. ఆర్థిక పరిస్థితులూ గొప్పగా లేవు.
ప్రభుత్వ ఉద్యోగి మినహా మరెవరి ఆర్థిక పరిస్థితి బాగుందో చెప్పండి. ఇంత జరిమానాలు చెల్లించే స్థితిలోనే సంపాదన లేనప్పుడు రోడ్డు మీదకు టూవీలర్స్ మీద తిరగడం కూడా చాలా కష్టం. పోలీసులు ప్రకటించిన జరిమానా లు కట్టడం కన్నా టూవీలర్స్ అమ్ముకొని కాళ్ళకు పని చెప్పడమో లేదా బస్సుకు వెళ్లడమో బెటర్ అనిపిస్తుంది. సరే ఇక్కడే ఒక్క విషయం ఆలోచిద్దాం కొందరు యువకులు బైక్స్ మీద చేసే వెకిలి చేష్టలు అరికట్టారా. స్పీడ్ డ్రైవింగ్ నియత్రించారా? ఇష్టారీతిన నెంబర్ ప్లేట్ వాడటం అరికట్టారా? వెరైటీ హారన్స్ అపగలిగారా? యువకులకు బైక్ లు కొనిచ్చి రోడ్ల మీదకు పంపినవారి పట్ల చర్యలు తీసుకున్నారా?. లేదు కదా.. బెజవాడలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సక్రమంగా జరుగుతున్నదా? బందరు రోడ్డులో షోరూమ్ ల ముందు పార్కింగ్ లను షాపు యజమానులకు ఇచ్చేశారు. చెన్నుపాటి బంక్ దగ్గర ఒక మాల్ కు సర్వీస్ రోడ్డు రాసిచ్చేశారు. ఫుడ్ కోర్ట్ రోడ్డు ప్రయాణానికి అనుకూలమా? కంకర రాళ్లతో రోడ్డు వేసి దానిపై వాహనాలు వెళ్ళాలా? విఐపి లు వచ్చేప్పుడు ట్రాఫిక్ ఎంతసేపు అపుతున్నారో ఆలోచించారా? బైక్ లపై వైసీపీ, టీడీపీ, జనసేన , పోలీస్, ప్రెస్, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా బోర్డులు తీయించారా? కార్లకు బ్లాక్ ఫిలిమ్ రూల్ వచ్చి ఎంతకాలం అయ్యింది? వాటిని తొలగించారా? రోడ్ల ప్రక్కన ఇడ్లీ బళ్ళు, ఫ్రూట్ బళ్ళు లేకుండా ఎందుకు చేయరు? ఇవన్నీ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగమే కదా.ఇవన్నీ నియంత్రించకూడా ఎలా సార్.బందరు రోడ్డుకు ప్యార్లర్ రోడ్ ఉందా.స్క్రుబ్రిడ్జి నుంచి ఆక్రమణలు వల్ల ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తం కాదా? పడవల రేవు వంతెన వద్ద చేపల మార్కెట్ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేవా? నవరంగ్ రోడ్డు,మ్యూజియం రోడ్డు లో ట్రాఫిక్ నిబంధనలు అమలు అవుతున్నాయా చెప్పండి.
హైవే వెంట రాంగ్ రూట్ నియంత్రణ జరుగుతున్నదా ఆలోచించండి ప్లీజ్. సామాన్యుడి ఆదాయం పెరగలేదు. మీరు ఇంత జరిమానా వేస్తే చాలా కష్టం సార్. సగటు కుటుంబ ఆదాయం పెరగలేదు. మీరు చెప్పిన వాటిల్లో ఎదో ఒకటి లేకుండా బైటకు వస్తే జరిమానా కట్టాలి. అంత డబ్బులు మా దగ్గర లేవు. జైలు లో పెట్టండి. అదే ప్రజల ముందు ఉన్న ఒకే ఒక మార్గం. అధికారులు,శాసనకర్తలు ఆలోచించాలి మరి.