ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సోకిన కరోనా.. హోమ్ క్వారంటైన్ 

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ లో తెలిపింది. ప్రతి రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వైద్య పరీక్షలు చేస్తుంటారు. అందులో భాగంగా నిన్న ఉదయం ఆయనకు కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు ఆయనను హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించినట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే ఆయనకు కరోనా కు సంబంధించిన లక్షణాలు ఏవీ లేవని ఆ ట్వీట్ లో తెలిపారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా ఆయన భార్య ఉషానాయుడుకు మాత్రం టెస్టులో నెగటివ్ వచ్చినట్టు తెలిపారు. ఆమె హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలియజేసింది.

 

కొద్ది రోజుల క్రితం జరిగిన రాజ్యసభ సమావేశాలను నిర్వహించిన వెంకయ్యనాయుడు.. ఎంపీలంతా కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పదేపదే సూచించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగిన సమయంలోనే 40 మంది ఎంపీలతో పాటు పలువురు సిబ్బందికి కరోనా రావడంతో సమావేశాలను కుదించారు. దీంతో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన వెంటనే ఉభయ సభల సమావేశాలను ముగించారు. ఇక దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖ నాయకులు కరోనా బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావంత్ కరోనా బారిన పడి ఇప్పటికే కోలుకున్నారు.