ఎక్కడకి పోతావు చిన్నవాడా! కేసులో చిక్కుకున్న కుర్రవాడా!

చేసేవన్నీ ఇల్లీగల్ పనులు.. అసలు విషయం బయటపడ్డాక నాకేమీ సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు.. ఆ పప్పులేవీ ఉడకకపోవడంతో పారిపోయే ప్రయత్నాలు. పారిపోవడానికి భారీ స్కెచ్.. 1800 కిలోమీటర్ల దూరం పారిపోయినా పోలీసులకు చిక్కడం.. ఇదీ బాలీవుడ్ నటుడు సాహిల్  ఖాన్ విషయంలో జరిగిన డ్రామా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సాహిల్ ఖాన్ ప్రధాన నిందితుడు. ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు రూపొందించిన ప్రకటనలో నటించాను తప్ప బెట్టింగ్ యాప్‌తో తనకేమీ సంబంధం లేదని సాహిల్ ఖాన్ ఈ కేసు బయటపడిన మొదట్లో సాహిల్ ఖాన్ బుకాయించాడు. పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. సాహిల్ ఖాన్ కేవలం యాడ్‌లో నటించిన నటుడు మాత్రమే కాదని, ఈ బెట్టింగ్ యాప్‌లో భాగస్వామి అని కూడా తేలింది. దాంతో సాహిల్ ఖాన్‌ని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తే సాహిల్ ఖాన్ జంప్ జిలానీ అయిపోయాడు. దాంతో పోలీసులు అతన్ని వేటాడ్డం ప్రారంభించారు.

పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సాహిల్ ఖాన్ మొట్టమొదటగా తన గెటప్ మార్చేశాడు. మహారాష్ట్ర నుంచి కర్నాటకకు వెళ్ళాడు.. ఆ తర్వాత తెలంగాణకు వెళ్ళాడు. తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కి పారిపోవడానికి ప్లాన్ చేశాడు. బస్సు, కారు, ఆటో, టూ వీలర్ మీద లిఫ్ట్... ఇలా రకరకాలుగా నాలుగు రోజులపాటు  1800 కిలోమీటర్లు ప్రయాణించి ఛత్తీస్‌గఢ్‌కి చేరుకున్నాడు. అతను అలా చేరుకున్నాడో లేదో పోలీసులు ఇలా అరెస్ట్ చేశారు. అడ్వాన్స్ టెక్నికల్ సదుపాయాల ద్వారా ట్రాక్ చేసి సాహిల్ ఖాన్‌ను పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇంతకీ మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా జరిగిన కుంభకోణం విలువ ఎంతో తెలుసా.. 15 వందల కోట్లు.. బాప్ రే!