రెండుగా చీలిన వైఎస్ కుటుంబం.. ఆస్తులు వారసత్వం కోసం యుద్ధం!
posted on Jan 24, 2024 2:21PM
ఎదుగింటి సందింటి రాజశేఖరరెడ్డి (వైఎస్ఆర్) కుటుంబం లో యుద్ధం మొదలయింది. ఆస్తుల తగాదా నుంచి అది వారసత్వ పోరు వరకూ వెళ్లిందన్నది ఆయన కుటుంబానికి సన్నిహితులైన వారు చెబుతున్న మాట. ఆస్తుల పోరు కాస్తా రాజకీయ వారసత్వ రణం వరకూ వెళ్లింది. ఈ యుద్ధంలో అన్న జగన్ ఒక వైపు.. చెల్లి వైఎస్ షర్మిల మరో వైపు మోహరించారు. అమ్మ కుమార్తె షర్మిల వైపే నిలిచిందని అంటున్నారు. వాస్తవానికి రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆయన కుటుంబం మొత్తం ఒక్కటై నిలిచింది. కష్ట కాలంలో ఒకరినొకరు ఓదార్చుకోవడంలో కానీ, తండ్రి రాజకీయ అండ చేజారిపోకుండా చూసుకోవడంలో కానీ, రాజకీయంగా కుటుంబం పెత్తనం సడలిపోకుండా కాపాడుకోవడంలో కానీ తల్లి, కుమారుడు, కుమార్తె, వీళ్లే కాకుండా వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన కుటుంబం ఇలా మొత్తం ఎదుగింటి సందింటి కుటుంబం ఒక్కటిగా నిలిచింది. అప్పటికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో తమ కుటుంబ పొలిటికల్ ప్లేస్, స్పేస్ ను కాపాడుకుంది. అయితే రాష్ట్ర విభజన తరువాత ఇక తెలంగాణయా, ఆంధ్రప్రదేశా ఏదో ఒకటే అని తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు సహజంగానే వైఎస్ కుటుంబం ఏపీకి అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైంది. తండ్రి స్థానంలో తనను కూర్చోపెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం నిరాకరించడంతో అలిగి, ఆగ్రహించిన జగన్ కాంగ్రెస్ కు కుటుంబంతో సహా గుడ్ బై చెప్పేశారు.
సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ అధినేతగా తన సొంత రాజకీయ ప్రయాణం ఆరంభించారు. 2014 ఎన్నికలలో విభజన ఎమోషన్స్ తో పాటు వైఎస్ కుమారుడు వైఎస్ జగన్ పై ఉన్న పలు కేసులు, ఆయన వ్యవహార శైలిపై ప్రజలలో ఉన్న సంశయాలు, అనుమానాల కారణంగా జగన్ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోయింది. అయితే విపక్ష నేతగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేసి పాదయాత్ర, ఓదార్పు యాత్ర అంటూ నిత్యం జనంలోనే గడిపారు. ఆయన ఆక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడంతో వచ్చిన సానుభూతి, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై జనంలో ఉన్న అభిమానానికి తోడు, సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య వంటి సంఘటనలు జగన్ కు ప్లస్ అయ్యాయి. దాంతో ఆ ఎన్నికలలో జగన్ పార్టీ వైసీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. వైసీపీ విజయానికి పైన చెప్పిన అన్ని కారణాలతో పాటు వైఎస్ కుటుంబం మొత్తం జగన్ కు అండగా నిలబడటం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోక తప్పదు. జగన్ జైల్లో ఉన్న సమయంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల చేసిన ప్రచారం, ప్రసంగాలు, జగన్ తల్లి విజయమ్మ కుమారుడి కోసం రోడ్డుపై బైఠాయించి మరీ తెలిపిన నిరసనలు, బాబాయ్ వైఎస్ వివేకా, ఆయన కుమార్తె డాక్టర్ సునీత వెన్నంటి ఉండటం కూడా జగన్ కు కలిసి వచ్చాయి. వైసీపీ ఘన విజయం సాధించి జగన్ ఏపీ సీఎం అయ్యారు. ఇదేళ్లు గిర్రున తిరిగే సరికి నాడు అంటే 2019 ఎన్నికల సమయంలో వైఎస్ కు కలిసి వచ్చిన అంశాలే ఇప్పుడు ఆయనకు ప్రతికూలంగా మారాయి.
నాడు జగన్ వెనుక ఐక్యంగా నిలిచిన కుటుంబం ఇప్పుడు ఆయనకు అండగా లేదు. నాడు జగన్ కు అనుకూలంగా సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన వివేకా హత్య, కోడికత్తి దాడి కేసుల్లో ఇప్పుడు వెళ్లన్నీ ఆయనవైపే చూపిస్తున్నాయి. అలాగే నాడు జగన్ కు కొండంత అండగా నిలిచిన చెల్లి వైఎస్ షర్మిల ఇప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా మారారు. నాడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలోకి వచ్చిన షర్మిల ఇప్పుడు తాను జగన్ కు గురిపెట్టిన బాణంగా మారిపోయింది. జగన్ ను నియంత అని నిందిస్తోంది. ఇక వైఎస్ బ్రాండ్ ను జగన్ తనంత తాను స్వయంగా వదిలించేసుకున్నారు. వైఎస్ కు సన్నిహితంగా ఉన్న వారెవరూ ఇప్పుడు జగన్ తో లేరు. ముఖ్యంగా వైఎస్ కు ఆత్మ అని చెప్పుకునే కేవీపీ ఇప్పుడు షర్మిల పక్కన నిలబడ్డారు.
ఇక తన నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని విధాలుగా విఫల సీఎంగా జగన్ ప్రజల ముందు తనను తాను ఆవిష్కరించుకున్నారు. ప్రశ్నిస్తే వేధింపులు, కేసులు, జైళ్లు. సంక్షేమం పేరిట అరకొర విదిలింపులు, పన్నుల పేరిట అంతకు పదింతల వడ్డింపులతో జగన్ పాలనపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇక పార్టీలోనూ తీవ్ర అసంతృప్తి. వాలంటీర్ల వ్యవస్థ అంటూ అన్ని అధికారాలనూ తన గుప్పిట పెట్టుకుని ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేయడంతో వారిలోనూ వ్యతిరేకత.. ఇలా వచ్చే ఎన్నికలలో విజయానికి అన్ని దారులూ మూసుకుపోయిన పరిస్థితి. అన్నిటి కంటే ముఖ్యంగా సొంత చెల్లి సంధిస్తున్న విమర్శనాస్త్రాలు, చేస్తున్న సవాళ్లు తాడేపల్లి ప్యాలెస్ పునాదులను కదిలించేస్తున్నాయి. షర్మిల ఏపీ రాజకీయాలలోకి ఇచ్చిన రీ ఎంట్రీ జగన్ ఎగ్జిట్ ను కన్ ఫర్మ్ చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏపీలో నియంత రాజ్యం నడుస్తోంది. ఏపీలో ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక మాఫియానే. కిలో మీటరు రోడ్డేయలేదు.. మూడురాజధానులు కడతాడా? జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయింది.. అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు రెడీ.. టైమ్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే.. డేట్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అంటూ చెల్లి షర్మిల విసురుతున్న సవాళ్లు జగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సొంత చెల్లీ, తల్లే తనకు ప్రత్యర్థులుగా ఎదురు నిలబడటంతో మీ రాజన్న బిడ్డను అంటూ జగన్ ప్రజల ముందు చెబుతున్న డైలాగులు మరీ నాటకీయంగా కనిపిస్తున్నాయి.
రాజకీయాల్లో చాలా కుటుంబాలు చీలిపోయాయి. సొంత అన్నదమ్ములే చెరో పార్టీలోనూ నిలబడి ప్రత్యర్థులుగా నిలబడిన ఉదంతాలు చాలా ఉన్నాయి. గాంధీ నెహ్రూ కుటుంబంలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ సతీమణి మేనకా గాంధీ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ కాంగ్రెస్ అధినేత్రి అయ్యారు. ఇప్పుడా పదవికి దూరంగా ఉన్నా పార్టీలో కీలక నేత ఆము. అలాగే కేసీఆర్ బీఆర్‌ఎస్ అధినేతగా ఉంటే.. ఆయన సొంత అన్న కూతురు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. చివరికి తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. కుటుంబ సభ్యులలో రాజకీయ దారులు వేరు కావడం కొత్తేం కాదు. కొనసాగుతోంది. కానీ వైఎస్ రాజవేఖర్‌రెడ్డి కుటుంబం మాత్రం నిట్ట నిలువుగా చీలిపోవడమే కాదు.. అన్న జగన్, చెల్లి షర్మిల ఉప్పు-నిప్పులా మారారు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం నాటకం అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. వ్యక్తిత్వ హననానికి కూడా వెనుకాడటం లేదు. షర్మిల ఇప్పటి వరకూ అన్నపై రాజకీయపరమైన విమర్శలే చేశారు కానీ జగన్ శిబిరం మాత్రం షర్మిలపై వ్యక్తిగత విమర్శలకు కూడా వెనుకాడటం లేదు. ఇందు కోసం ఆమె వ్యక్తత్వ హననానికీ పాల్పడుతోంది. ఆమె కులం, కులాంతర వివాహం, పెళ్లి, పెళ్లిళ్లు వంటి అంశాలను తెరపైకి తీసుకు వస్తున్నది. దీనిపై షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది రానున్న రోజులలో తెలుస్తుంది. మొత్తం మీద అన్నా చెల్లెళ్ల వార్ కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే పరిస్థితి ఎటూ లేదు.. చీలేదల్లా వైసీపీ అనుకూల ఓటు మాత్రమేనని ఇది కాంగ్రెస్ కు పెద్దగా ప్రయోజనం చేకూర్చదు కానీ, జగన్ కు, జగన్ పార్టీకీ మాత్రం పూడ్చుకోవడానికి అవకాశం లేని నష్టం చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.