గంటా సరే.. ఆర్కే సంగతేంటి?

మూడేళ్ల కిందట గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాపై ఎట్టకేలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. అది కూడా ఎలా అంటే నిబంధనల ఊసే లేకుండా రాజీనామా ఆమోదించేశారు. రాజీనామా ఆమోదించే ముందు ఆ రాజీనామా చేసిన సభ్యుడిని వివరణ అడగాలన్న కనీస ధర్మాన్ని కూడా పాటించలేదు. అసలు గంటా రాజీనామా చేశారన్న విషయాన్నే అందరూ మరిచిపోయారు. సరే ఇప్పుడు ఓ రెండు నెలలలోగా రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అధికభాగం ఎటూ క్రాస్ ఓటింగ్ చేస్తారు. కనీసం విపక్ష ఎమ్మెల్యేల సంఖ్య ఏదో రకంగా తగ్గించేసైనా గట్టెక్కేయచ్చన్న జగన్ దూరాలోచనో, దురాలోచనో మొత్తం మీద స్పీకర్ సీతారం ను ప్రభావితం చేసింది. అంతే ఆయన ఇన్నేళ్లుగా పెండింగ్ లో పెట్టిన గంటా రాజీనామాకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసేసుకున్నారు. ఇప్పుడు ఆయన రాజీనామాను ఆమోదించడం వల్ల ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఎటూ లేదు. మహా అయితే రాజ్యసభ ఎన్నికలో ఆయనకు ఓటు వేసే అవకాశం ఉండదు అంతే. మరో ఎనమండుగురు ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఏదో సామెత చెప్పినట్లు చాలా చాలా సమయం తీసుకుని మరీ ఇప్పుడే సరిగ్గా రాజ్యసభ ఎన్నికలకు ముందు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వారిపై అనర్హత వేటు వేయడానికి రెడీ అయిపోయారు.   అయితే తమ్మినేని సీతారాం పేరుకే స్పీకర్ కానీ ఆయన ఎన్నడూ ఆ పదవిలో ఉన్ననన్న స్ఫృహతో వ్యవహరించిన దాఖలాలు లేవు. పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకూడదన్న నిబంధనకు ఆయన విలువ ఇచ్చిన దాఖలా ఒక్కటీ కనిపించదు. 

మూడేళ్ల కిందట రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖ .. ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు ఆమోదించేయాలని ఆయన భావించారు.  ఆమోదించేశారు.  అదే సమయంలో స్పీకర్ గా ఒక రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకునేముందు ఆ ఒక్క రాజీనామాయే కాకుండా తన ముందు పెండింగ్ లో ఉన్న అన్ని రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే  సీతారాం తీసుకునే నిర్ణయాలు స్పీకర్ గా నిష్పాక్షికంగా కాకుండా ఒక వైసీపీ అనుకూల వాదిగా మాత్రమే తీసుకుంటారు. అందుకే గంటా రాజీనామాకు ఓకే అనేశారు. తన వద్ద పెండింగ్ లో ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే విషయాన్ని కన్వీనియెంట్ గా మరిచిపోయారు. అదీ తన పార్టీ బాస్ జగన్ ఆదేశం మేరకే అయి ఉంటుందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తారనీ, అలాంటి విశ్లేషణల వల్ల తనకు  మేలు జరుగుతుందనీ జగన్ భావించడం వల్లేనని అంటారు.

ఎందుకంటే ఆళ్ల స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయడమే కాదు. ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకుని ఆ పార్టీ తీర్థం పుచ్చేసుకున్నారు. అయినా స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించకపోవడం ద్వారా పార్టీ మారినా ఆళ్ల వైసీపీ వాడేనని ఉద్దేశపూర్వకంగా చాటేందుకేనని, అలా చాటడం ఇప్పుడు కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన షర్మిల ఎటువైపు అన్న అనుమానం ఆమె రాకను స్వాగతిస్తూ ఆమె వెంట నడవడానికి రెడీ అయిన వైసీపీ అసంతృప్తుల్లో కలిగుతుందనీ జగన్ కు కావలసింది కూడా అదేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu