వైసీపీలో గందరగోళం.. జగన్ లో కనిపించని చలనం!
posted on Jan 24, 2024 2:44PM
ఎప్పుడైనా ఎన్నికల వేళకి అధికార పార్టీలో స్పష్టత ఉంటూ.. ప్రతిపక్ష పార్టీలో గందరగోళ పరిస్థితి ఉంటూ వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల నుండి తాజాగా తెలంగాణ ఎన్నికల వరకూ తెలుగు రాజకీయాలలో అదే చూశాం. కానీ, ఏపీలో మాత్రం ప్రతిపక్ష టీడీపీ జనసేనతో పొత్తులో ఉండి కూడా ధీమాగా కనిపిస్తుంటే.. అధికార వైసీపీలో తీవ్ర గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో.. ఎంపీ అభ్యర్థి ఎవరో.. ఎవరు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారో కూడా అర్ధంకాక క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. అసలు పార్టీలో ఉండేది ఎవరో.. వలస వెళ్లి పోయేది ఎవరో కూడా తెలియడం లేదు. చివరికి బీ ఫామ్ ఎవరికి దక్కుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి కనిపిస్తున్నది. కొందరు బెదిరింపులకు దిగుతుంటే.. మరికొందరు చాపకింద నీరులా పార్టీకి ముప్పు తెచ్చి పెడుతున్నారు. ఇప్పటికే కొందరు రాజీనామాల బాట పట్టగా.. మరికొందరు ఇతర పార్టీల నుంచి హామీల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ తనకేమీ పట్టదన్నట్లు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నారు. అసంతృప్తి, అసమ్మతుల విషయంలో చేతులెత్తేసి నేను తాంబూలాలిచ్చేశాను.. ఇక తన్నుకు చచ్చే పని మీదేనని పార్టీ నేతలు, క్యాడర్ కు చెప్పకనే చెబుతున్నారు. .
ఏపీలో ఎన్నికల హీట్ ఆరు నెలల కిందటే పీక్స్ కు చేరింది. ఇక ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల కావడానికి వారాల గడువు మాత్రమే ఉంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే ఏపీలో ఇంకో 20 రోజులలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అర్ధమౌతుంది. ఇప్పకే ఈసీ ఎన్నికల ఓటర్ల తుదిజాబితా విడుదల చేసింది. అంటే ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని పరోక్షంగా ఈసీ కూడా వెల్లడించింది. దీంతో ఎవరు ఏం చేసినా.. ఎలాంటి ఎత్తులు వేసినా.. బుజ్జగించినా.. లాబీయిగ్ చేసినా ఈ 20 రోజుల్లోనే చేయాల్సి ఉంది. ఒక్కసారి కోడ్ కుంపటి ముట్టించిన తరువాత ప్రచారానికి తప్ప ఇంక దేనికీ సమయం ఉండదు.
అధికారంలో ఉన్న పార్టీ కనుక ఇప్పటికే ఎన్నికల డేట్ కూడా జగన్ కు తెలిసే ఉంటుంది. మరి ఇన్ని తెలిసిన జగన్ ఎందుకిలా ఉంటున్నారు. ఒకవైపు పార్టీలో అసంతృప్తులు చెలరేగి పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? సీట్ల మార్పులో ఇంత గందరగోళం నెలకొన్నా సరిదిద్దే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? కేవలం సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి వారే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మ్యానేజ్ చేస్తారని భావిస్తున్నారా? లేక పార్టీలో ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరిని నిలబెట్టినా తన మొహం చూసే ఓటేస్తారని ఇప్పటికీ నమ్ముతున్నారా? లేక వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులే తనను గెలిపిస్తారన్న భ్రమల్లో ఊరేగుతున్నారా? ఏ ధైర్యం చూసుకొని జగన్ ఎన్నికల ముంగిట ఇంత ధీమాగా ఉన్నారన్నది పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా అర్థం కాక తలలు కొట్టుకుంటున్నారు.
అయితే, జగన్ లో ఇప్పుడు ఎన్నికల పట్ల ఉన్నది ధీమా కాదని.. నిండా మునిగిపోయాం ఇక చలేమిటన్న భావనతో చేతులెత్తేశారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నో విడతలుగా స్వయంగా చేయించుకున్న సర్వేలలో ఓటమి తప్పదని తేలిపోయింది. దళితులపై దాడులతో వారిలో నమ్మకం కోల్పోయారు. కాపు సామజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకొనేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఒక్కటీ కలిసి రాలేదు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, తనను ప్రశ్నించిన వారిపై బనాయించిన అక్రమ కేసుల ప్రభావం జగన్ పైన, ఆయన పార్టీపైనా జనంలో నమ్మకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. దీనికి తోడు రాష్ట్రంలో సకల వర్గాలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితిలో ఇక ఏం చేసినా లాభం లేదని తేలిపోయింది. ఈసారి ఓటమి ఖాయమైంది. కాకపోతే కనీసం పరువును కాపాడుకునేందుకే ఈ అభ్యర్థుల మార్పులు, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉపయోగించడం వంటివి చేస్తున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. వైసీపీలో ఇప్పుడు నెలకొన్న అనిశ్చితి తొలగాలంటే కనీసం ఆరు నెలల సమయం కావాలి. కానీ మూడు వారాల గడువులో ఏం చేసినా ప్రయోజనం ఉండదు. అందుకే జగన్ పూర్తిగా హ్యాండ్సప్ చెప్పేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.