రాజకీయ నాయకుల భాష హుందాగా ఉండాలి : వెంకయ్యనాయుడు
posted on Aug 5, 2025 2:52PM
.webp)
రాజకీయ నాయకుల భాష తీరు మారాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. సీనియర్ సంపాదకులు ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం-విభజన మన ముఖ్యమంత్రులు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు. విలీనం - విభజన మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని నేటితరం యువత తప్పనిసరిగా చదవాలని ఆయన కోరారు.
ఈ పుస్తకం చదివితే నాయకుల పరిపాలన, విజ్ఞానం, వారి గురించి అన్ని విషయాలు తెలుస్తాయని తెలిపారు. పత్రికా సమాజానికి దర్పణం లాంటిదని... ఈ సమాజంలో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలని ఆకాంక్షించారు. మనం వ్యూస్ కోసం న్యూస్ చేయకూడదని.. దానికోసమే కాలమ్స్ ఉన్నాయని, రాసుకోవడానికి అందులో వాళ్ల అభిప్రాయాలు చెప్పొచ్చని పేర్కొన్నారు. భాష విషయంలో రాజకీయ నాయకులు చాలా హుందాగా ప్రవర్తించాలని సూచించారు.
చాలా మంది జర్నలిస్టులు కొత్తగా యూట్యూబ్‌లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. యూట్యూబ్‌లో కూడా అలానే పెట్టేస్తున్నారు.. ఏంటని అడిగితే వాళ్ళు అన్నారు సార్ అంటున్నారు. పాత్రికేయంలో భాష చాలా ముఖ్యమని తెలిపారు. గతంలో బూతులు మాట్లాడిన నేతలు ఎవరు గెలవలేదన్నారు. తన జీవితంలో రెండు సార్లు కంటతడి పెట్టానని గుర్తుచేసుకున్నారు. ఒకటి తన అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు... తాను తన అమ్మను చూడలేదని భావోద్వేగానికి గురయ్యారు.
రెండోది పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలిచి తనను ఉప రాష్ట్రపతిగా చేసినప్పుడు...తనకు రాజకీయాల్లో నుంచి వైదొలగడం ఇష్టం లేదని తెలిపారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాను భారతీయ జనాత పార్టీ ఆఫీస్‌కు వెళ్లాలేదని తెలిపారు. ఉప రాష్ట్రపతిగా విరమణ పొందిన తర్వాత యువత కోసం రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి, పుస్తక రచయిత ఇనగంటి వెంకట్రావు, సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, బండారు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.