ఓ మహిళను కాపాడబోయి దంపతుల మృత్యువాత
posted on Aug 5, 2025 3:04PM
.webp)
వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరంటారు. ఏదీ మన చేతుల్లో ఉండదు. మరణం ఎప్పుడు, ఎలా రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం. పెద్ద పెద్ద ప్రమాదాల బారిన పడి కూడా ప్రాణాలతో బయటపడే వారుంటారు. చిన్నపాటి ప్రమాదంతోనే మృత్యవాతకు గురైన వారి సంఘటనలూ చూస్తుంటాం. సరిగ్గా అటువంటి సంఘటనే వికారాబాద్ జిల్లా మోయిన్ పేట మండలం చీమలదర్తి గ్రామంలో జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా నాగులపల్లి గ్రామానికి చెందిన నాగమణి జీవనోపాధి కోసం హైదరాబాదు నగరానికి వలస వచ్చి వికారాబాద్ జిల్లాలోని మోయిన్ పేట్ మండలంలో ఉన్న చీమల దరి గ్రామంలో నివసిస్తున్నది. పూజిత అనే ఒక పెద్ద వెంచర్లో కూలీలుగా పనిచేస్తున్నది. కారణమేంటో తెలియదు కానీ నాగమణి బావిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అది చూసిన బాల మైసయ్య ఆమెను కాపాడ డానికి బావిలో దూకాడు. భర్త బావిలో దూకడం చూసిన మైసయ్య భార్య అలివేలు కూడా బావిలోకి దూకింది.
ఇదంతా చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో దూకిన ముగ్గురినీ కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే మైసయ్య, అలివేలు నీటిలో మునిగి పోయి మృతి చెందారు. ఆత్మహత్యాయత్నం చేసిన నాగమణి ప్రాణాలతో బయటపడింది. ఓ మహిళను కాపాడే యత్నంలో దంపతులు మరణించడం చూసిన వారి చేత కంటతడి పెట్టించింది. మైసయ్య, అలివేలు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.