గోవధపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

 

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో మత అసహనం పెరిగిపోతోందని కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. మొదట దాని ప్రచారాన్ని బీజేపీ, మోడీ ప్రభుత్వం చాలా లైట్ గా తీసుకొన్నప్పటికీ, దాని తీవ్ర ప్రభావాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. బిహార్ ఎన్నికలలో బీజేపీ పరాజయానికి గల అనేక కారణాలలో, కాంగ్రెస్ మిత్రపక్షాలు చేసిన ఈ మత అసహన ప్రచారం కూడా ఒకటని చెప్పక తప్పదు.

 

నిజానికి ఈ విషయంలో బీజేపీ లేదా నరేంద్ర మోడీ చేస్తున్న పొరపాటు ఏమీ లేకపోయినప్పటికీ, ఆర్.ఎస్.ఎస్., విశ్వహిందూ పరిషత్, శివసేన వంటి కొన్ని సంస్థలు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న అసందర్భ మాటలవలననే, మోడీ ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కోవలసి వస్తోంది. దానికి మూల్యం కూడా చెల్లించవలసి వస్తోంది. బిహార్ ఎన్నికలలో గోవధ, గొడ్డు మాంసం తినడం ప్రధాన అంశాలుగా మారిన సంగతి అందరికీ తెలుసు. కనుక బిహార్ లో ఓటమి తరువాత అయినా ఇటువంటి సున్నితమయిన విషయాలపై బీజేపీ దృష్టి సారించి నష్ట నివారణ చర్యలు చేపడుతుందని అందరూ భావించారు. కానీ తమ పార్టీకి, ప్రభుత్వానికి వేరే ఇతర వ్యక్తుల కారణంగా ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ ఇంకా బీజేపీ మేల్కోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

అయితే ఇంతవరకు కేవలం బీజేపీతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నవాళ్ళు మాత్రమే ఈ వివాదాస్పద అంశాల గురించి మాట్లాడేవారు. కానీ మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ బీజేపీ ఆలోచనలు, సిద్దాంతాలకి అనుగుణంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ “దేశంలో ఏ మతానికి చెందినవారయినా ఆవులను చంపకూడదు. అటువంటి వ్యక్తులు దేశానికి శత్రువులు. వారికి దేశంలో నివసించే హక్కు లేదు. మా ప్రభుత్వం గోవధ నిషేధానికి అన్ని చర్యలు చేపడుతోంది. గోవధ చేసేవారిని కఠినంగా శిక్షించాలి,” అని అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యల వలన ఈ సమస్యను మళ్ళీ కెలికి సజీవంగా ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ఆలోచనలకి అనుగుణంగా మాట్లాడటం కూడా అనుమానంగానే ఉంది. ఆయన యాదృచ్చికంగా ఈవిధంగా మాట్లాడారా లేక బీజేపీలోకి వెళ్ళే ఆలోచనతో అన్నారా లేక ఇప్పటికే దెబ్బ తిన్న బీజేపీని ఇంకా దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతోనే అన్నారా? అనేది మున్ముంది తేలుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu