వైట్‌హౌస్‌నే టార్గెట్ చేశారు...
posted on Nov 20, 2015 11:40AM

పాముకు పాలుపోసి పెంచితే ఏమవుతుంది? పాలు పోసిన చేతినే కసితీరా కాటేస్తుంది. ఇప్పుడు అమెరికా పరిస్థితి అలాగే తయారైంది. తన ఆధిపత్యం కోసం గతంలో ఉగ్రవాద సంస్థలకు ఊతాన్ని ఇచ్చిన అమెరికా ఆ పాపానికి ఫలితాన్ని గతంలో ఉగ్రవాదుల దాడులు, ట్విన్ టవర్స్ కూల్చివేత ఉదంతాలతో అనుభవించింది. అప్పటి నుంచి ఉగ్రవాదుల అణచివేతే తన ధ్యేయమని అమెరికా ప్రకటిస్తున్న కొంత కార్యాచరణను చూపిస్తున్నప్పటికీ ప్రపంచం మనసులో అమెరికా గతంలో చేసిన పాపాలు ఇప్పటికీ కదలాడుతూనే వున్నాయి. అమెరికా చేసిన పాపాల్లో ఒకటి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఊతం ఇవ్వడం. అమెరికా పుణ్యమా అని ఆవిర్భవించి చాలా తక్కువకాలంలోనే బలమైన ఉగ్రవాద సంస్థగా మారిన ఐసిస్ చేస్తున్న దారుణాలకు అంతూ పొంతూ లేకుండా పోయింది. ప్రశాంతంగా వుండే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ మీద ఇటీవల దాడులు చేసి 129 మందిని పొట్టన పెట్టుకుంది. ఆమధ్య రష్యన్ విమానాన్ని కూల్చివేసి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌నే టార్గెట్ చేసింది.
త్వరలో వైట్‌హౌస్ మీద ఆత్మాహుతి దాడి చేస్తామని, కారు బాంబుతో వైట్‌హౌస్‌ని పేల్చివేస్తామని ఐసీస్ సంస్థ ఆరు నిమిషాల నిడివి వున్న విడియోను విడుదల చేసింది. ఇది అమెరికా వెన్నులో చలి పుట్టిస్తోంది. ట్విన్ టవర్స్ దాడి తర్వాత అమెరికా ఉగ్రవాదుల పేరు చెబితేనే హడలిపోతోంది. గతంలో అమెరికా అత్యంత భద్రత కలిగిన దేశం అనే భ్రమలు వుండేవి. ట్విన్ టవర్స్ దాడుల తర్వాత ఆ భ్రమలు తొలగిపోయాయి. అందుకే ఇప్పుడు వైట్‌హౌస్‌ని పేల్చేస్తామని ఐసీస్ ఉగ్రవాదులు చేసిన హెచ్చరికను అమెరికా ప్రజలుగానీ, ప్రభుత్వం గానీ తేలిగ్గా తీసుకోవడం లేదు. ఏ తరహాలో దాడి చేయబోతున్నారో కూడా ముందుగానే చెప్పడం ఐసీస్ ఉగ్రవాదుల తెగువకు నిదర్శనం. మరి అమెరికా ఈ సవాల్‌ని ఎలా ఎదుర్కొంటుందో... తనను తాను ఎలా రక్షించుకుంటుందో!