తిరుమల పవిత్రత పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత
posted on Sep 25, 2025 10:11AM
.webp)
తిరుమల పవిత్రత పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్వాల సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం రంగనాయకుల మండపం నుండి భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు.. సీఎంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశాన్ని ఆ వేంకటేశ్వర స్వామి తనను పలుమార్లు కల్పించారన్నారు. అలిపిరి ఘటనలో తాను ప్రాణాలతో బయటపడటం కూడా ఆ స్వామి వారి సంకల్పమేనని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
దాదాపు నాలుగు దశాబ్దాల కిందట ఎన్.టి.రామారావు ప్రారంభించిన అన్నప్రసాద వితరణ సత్కార్యం నేడు అనేక రెట్లు విస్తరించి.. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందజేస్తోందని పేర్కొన్నారు. ఈ సేవను అన్ని టిటిడి ఆలయాలకు విస్తరించాలని టిటిడి చైర్మన్, బోర్డు సభ్యులు, అధికారులను ఆయన కోరారు.
శ్రీవాణి ట్రస్ట్ కు ఇప్పటివరకు రూ.2,038 కోట్ల విరాళాలు అందాయన్న ఆయన.. అందులో రూ.837 కోట్లు ఆలయ నిర్మాణానికి ఖర్చు చేశారన్నారు. దేశలోని 29 రాష్ట్రాల రాజధానులలోనూ శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని, వివిధ దేశాల్లో శ్రీవారి భక్తులు అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మించాలని చంద్రబాబు టీటీడీకి సూచించారు.
తనకు ప్రాణభిక్ష పెట్టిన రోజునే ఎస్‌వి ప్రాణదాన ట్రస్టును తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంభించామని గుర్తు చేసిన ఆయన ఇప్పటివరకు ఈ ట్రస్టుకు రూ.709 కోట్లు విరాళంగా వచ్చాయన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా పేదలకు వైద్య సహాయంఅందజేస్తున్నట్లు తెలిపారు. స్వామివారి సేవకుల సేవలను చంద్రబాబు ప్రస్తుతించారు. స్వామివారి సేవకులు స్వామివారి నిజమైన సంపద అన్నారు.