రేపో మాపో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ!.. తెలుగు రాష్ట్రాలకు నో చాన్స్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గం విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఈ నెల31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ లోగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఢిల్లీ రాజకీయ వర్గాల భోగట్టా. ఆ మేరకు రేపో మాపో మోడీ తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశాలున్నాయి.  2023) ఒక విధంగా ఎన్నికల నామ సంవత్సరం. ఈ ఏడాది తెలంగాణ సహా 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

సో .. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా వచ్చే ఏడాది ( 2024)లో జరిగే సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని   కేంద్ర మంత్రి వర్గంలో    మార్పులు చేర్పులు చేసేందుకు మోడీ   నిర్ణయించారనీ, ఇందు కోసం భారీ కసరత్తు కూడా చేశారని అంటున్నారు.    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు దాదాపు ఏడాది పైగా గడువు ఉంది.  ఈ నేపధ్యంలో, అన్ని కోణాల్లో పరిస్థితిని సమీక్షించుకుని, మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రెడీ అయ్యారని అంటున్నారు. 

కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏడాది మే 31న తొలి మంత్రివర్గం ఏర్పడింది. 2021 జులై ఏడో తేదీన మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రస్తుతం ప్రధానమంత్రితో కలిపి 31 మంది కేబినెట్‌ మంత్రులు, ఇద్దరు స్వతంత్ర హోదా మంత్రులు, 45 మంది సహాయ మంత్రులు మొత్తం   78 మంది ఉన్నారు. కేంద్రంలో గరిష్ఠంగా 83 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. అంటే మరో ఐదుగురిని కేబినెట్ లో చేర్చుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ఇదే చివరి మంత్రివర్గ విస్తరణగా భావిస్తున్నారు.   కేవలం అవకాశం ఉన్న ఐదుగురికి స్థానం కల్పించడమే కాకుండా పని తీరు ఆధారంగా కొందరికి ఉద్వాసన పలికి.. మరి కొందరు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మోడీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పోతే ఈ ఏడాది  జగరనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఎలాగైనా తెలంగాణలో విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవాలన్న పట్లుదలతో ఉంది. అందుకే మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనగానే తెలంగాణకు బెర్త్ ఖాయం అంటూ ఊహాగానాలు చెలరేగాయి.

అలాగే గత మూడున్నరేళ్లుగా  కేబినెట్ లో అసలు ప్రాతినిథ్యమే లేని ఏపీకి కూడా ఈ సారి బెర్త్ కన్ఫర్మ్ అంటూ వార్తలు వినవచ్చాయి. అయితే మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు రిక్తహస్తమేనని ఢిల్లీలోని బీజేపీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్ఠిలో పెట్టుకుని అన్ని విధాలుగా ఆలోచించి.. మోడీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరనించనున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి.