రాష్ట్రానికి తీరని అన్యాయం.. అయినా మౌనమేనా?

రాష్ట్ర విభజనకు  ముందు, అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఒక గుర్తింపు గౌరవం ఉండేది. ఇప్పుడు అవేవీ లేవు. తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్, పార్లమెంట్’కు సమర్పించిన 2022-23 వార్శిక బడ్జెట్’ అదే విషయాన్ని మరో మారు రుజువు చేసింది.అయితే రాష్ట్ర విభజనకు, తెలుగు రాష్ట్రాలపై  కేంద్రం సీతకన్ను వేయడానికి ప్రత్యక్ష సంబంధం వుందా అంటే ఉండక పోవచ్చును. కానీ, పరోక్షంగా అయితే ఎంతో కొంత సంబందం ఉండకుండా ఉండదు.  మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో తెలుగు గళం వినిపించేందుకు అరడజను మంత్రికి పైగా మంత్రులు ఉన్నారు. అప్పట్లో  అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ నుంచి, పల్లం రాజు, కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, పురందేశ్వరి,రేణుక చౌదరి, పనబాక లక్ష్మి, సర్వేసత్యనారాయణ, బలరాం నాయక్, జేడీ శీలం ఇలా ఇంచుమించుగా అరడజను మందికి పైగా మంత్రులు ఉన్నారు. కానీ,ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబందించి ఒకే ఒక్కడు, కిషన్ రెడ్డి ఒక్కరే మంత్రి. అంటే, మంత్రి వర్గంలో కానీ, మరో విధంగా గానీ, తెలుగు ప్రజల డిమాండ్స్ వినిపించే అవకాశమే ఎలుగు రాష్ట్రాలకు  లేకుండా పోయింది. 

అయితే, కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేక పోవడం, కేంద్రం చిన్న చూపు లేద నిర్లక్ష్య ధోరణికి ఒక కారణం అయితే కావచ్చును కానీ, రాష్ట్రాలలో  అధికారంలో ఉన్న పార్టీల నాయకత్వం వేస్తున్న తప్పటడుగులు, తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు, ఈ అన్నిటినీ మించి,  నాయకులను నీడలా వెంటాడుతున్న అక్రమాస్తుల కేసులు, అవినీతి భాగోతాల భయం కూడా రాష్ట్రాల ప్రయోజనాలని దెబ్బ తీస్తున్నాయి. నిజానికి సంఖ్యా బలం లేక పోవడం కంటే, అక్రమాస్తుల కేసులు అవినీతి ఆరోపణలలే అసలు కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు.  

ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ విషయంలో అయితే కేంద్ర బడ్జెట్’ లో రాష్ట్ర ప్రస్తావన మచ్చుకైనా లేక పోయినా, ముఖ్యమంత్రి కనీసం పెదవి అయినా విప్పలేదంటే, పరిస్థితి ఏమిటో, వేరే  చెప్పనక్కర్లేదు. ఉద్దేశం ఏదైనా, ఫలితం సంగతి ఎలా ఉన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం నిరసనను తనదైనా ‘భాష’లో గట్టిగానే వినిపించారు. కానీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కానీ, వైసేపీ నాయకులు కానీ, కనీసంగా అయినా కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రశ్నించలేదు. ప్రశ్నించే సాహసం చేయలేదు. బహుశా ప్రశ్నిస్తే, జైలు దారులు తెరుచుకుంటాయని భయమో, ఏమో అందరూ మౌనంగానే ఉన్నారు. 

నిజానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలినాళ్ళ నుంచి, రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే వుంది. ఈసారి బడ్జెట్‌లోనూ, అదేచేసింది. ఆర్థికలోటుతో కునారిల్లుతున్న రాష్ట్రంపై మరోసారి అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్ర విభజన చేసిన  గాయాల నుంచి కోలుకోలేక ఆర్థిక లోటులో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కనీస కనికరం కూడా చూపలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో మాట మాత్రంగానైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావన రాలేదు. ప్రత్యేక హోదా, రామాయపట్నం ఓడరేవు, కడప ఉక్కు కర్మాగారం, రాజధాని, పోలవరం ఇలా విభజన హామీల్లో ఏ ఒక్కటీ ప్రకటించలేదు. అసలు ప్రస్తావనే లేదు.

నిజమే గతంలోనూ, కేంద్రం రాష్ట్రం పట్ల నిర్లక్ష్య ధోరణే చూపుతూ వచ్చింది. అయితే, అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగు దేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  బీజేపీ మిత్ర పక్షమే అయినా, నాలుగేళ్ళు చూసి ఇక లాభ లేదనుకుని, రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనుకుని ఎన్డీఎ నుంచి బయటకు వచ్చారు. ప్రత్యేక హోదా ఇతర విభజన హామీల అమలు కోసంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ‘ధర్మ పోరాటం’ చేశారు. పార్లమెంట్’లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగ అవిశ్వాస తీర్మానం పెట్టి,  ఆంధ్ర ప్రదేశ్’కు బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్ళారు.

కానీ, ఇప్పుడు  ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తావనే లేకుండా బండి లాగించేసినా,మౌనాన్ని వేడడం లేదు. అందుకే, ముఖ్యమంత్రి తనను తాను  కాపడుకోవడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారా? అంటే, విశ్లేషకులు  కాదనలేమని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu