చంద్రబాబు కన్నీళ్లు డ్రామా కాదు.. సీఎంగా జ‌గ‌న్ ఘోరంగా విఫ‌లం..

ఏపీ అసెంబ్లీ ప‌రిణామాలు.. భువ‌నేశ్వ‌రిపై కామెంట్లు.. చంద్ర‌బాబు ఏడ్వ‌డంపై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌రెడ్డి అండ్ బ్యాచ్ తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. చంద్ర‌బాబుకు పూర్తి మ‌ద్ద‌తు పలికారు. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌ని.. అసెంబ్లీలో ప్ర‌జాస్వామ్యం అబాసుపాలైంద‌ని ఉండ‌వ‌ల్లి మండిప‌డ్డారు. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే... 

"ఎన్టీఆర్‌ కుమార్తెల గురించి నేనెప్పుడూ ఎలాంటి పుకార్లు వినలేదు. హరికృష్ణ, పురందేశ్వరితో నాకు పరిచయం ఉంది, వాళ్లు చాలా మంచివారు. చంద్రబాబు కన్నీళ్లు డ్రామా అని అనుకోవడం లేదు. చంద్రబాబుకు తెలియదా.. సింపతీ పనిచేయదని? చంద్రబాబును ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడుతుంటే జగన్‌ ఏం చేస్తున్నారు? ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే అంత అవివేకం ఇంకోటి లేదు" అని ఉండవల్లి అన్నారు. 

"ఓ మంత్రి అయితే రేయ్‌, వాడు, వీడు అనడం సర్వసాధారణం అయిపోయింది. చంద్రబాబును అంతలా దారుణంగా తిడితే ఎవరు గౌరవిస్తారు? విపక్ష నేతలు, మనుషులకు వైసీపీ మంత్రులు గౌరవించాలి. విపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం. విపక్షంలేని అసెంబ్లీలో వైసీపీ నేతలు భజన చేశారు.. పాటలు పాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లే" అని చెప్పారు ఉండవల్లి. 

ఏపీ సీఎం జగన్‌ పాలనలో ఘోర వైఫల్యం చెందారని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విమర్శించారు. "సీఎంగా జగన్‌ ఇంత ఘోరంగా విఫలమవుతారని ఊహించలేదు. 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకొని.. మళ్లీ పెడతాం అనడం ప్రభుత్వ వైఫల్యమే". ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని.. రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ప్రతిపక్షం సలహాలు తీసుకుంటేనే ప్రభుత్వానికి పేరు వస్తుందని ఉండ‌వ‌ల్లి స‌ల‌హా ఇచ్చారు.
--రోజా పొగడ్తలు మంత్రి పదవి కోసమేనా?