రక్తం ధార పోసేందుకు సిద్ధమేనా.. తెలంగాణ‌కు మంచి రోజులు..

ఈట‌ల గెలుపు త‌ర్వాత‌ బీజేపీ ఫుల్ జోష్ మీదుంది. తెలంగాణ‌లో అధికారం త‌మ‌దేన‌ని ఫిక్స్ అయింది. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌- ఫామ్ హౌజ్ వీడి బ‌య‌ట‌కు రాని సీఎం కేసీఆర్‌ను.. ధ‌ర్నా చౌక్‌లో దీక్ష‌కు దిగొచ్చేలా చేసిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని ఉత్సాహంగా ఉంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ దూకుడు మామూలుగా లేదు. వ‌రి కొనుగోళ్ల‌పై జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేసి.. కేసీఆర్‌ను బెదిరిపోయేలా చేశారు. కేసీఆర్‌ మూడుసార్లు ప్రెస్‌మీట్లు పెట్టేలా చేశారు. ముఖ్య‌మంత్రిని ఢిల్లీకి ప‌రుగులు పెట్టించారు. ఇంతా చేసి.. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేసిన‌ట్టు? ఏం సాధించిన‌ట్టు? అని ప్ర‌శ్నిస్తున్నారు బండి సంజ‌య్‌.

సీఎం కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో అర్థం కాలేదని బండి సంజయ్‌ అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే వెళ్లినట్టు ఆరోపించారు. సొంత పనుల కోసమే ఢిల్లీ వెళ్లారని.. బీజేపీను అప్రతిష్ఠ పాలు చేసే కుట్రలు పన్నారని విమర్శించారు. 

"తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. రక్తం ధార పోసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. ప్రగతిభవన్‌లో నాలుగు స్తంభాలాట ప్రారంభమైంది. తమను సీఎంను చేయాలని కుమారుడు, బిడ్డ, అల్లుడు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారు." అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు బండి సంజ‌య్‌.  

"సీఎం పోకడలతో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొత్తం దెబ్బతింది. ఎంబీసీ పేరుతో బీసీ కులాల మధ్య కేసీఆర్‌ చిచ్చు పెట్టారు. ప్రజల ఆశీర్వాదంతో 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. డిసెంబరు 17నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం అవుతుంది" అని బండి సంజ‌య్ ప్ర‌క‌టించారు.  
--ర‌వీంద‌ర్‌సింగ్‌తో ఈట‌ల స్కెచ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్‌..