అప్పుల కోసం చట్టాలకు తూట్లు   జగన్ సర్కార్ కొత్త ఎత్తులు

ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్  ప్రభుత్వం అన్ని  గీతలు  దారేసింది. ఆర్హతకు, ఆదాయానికి  మించి అప్పులు చేసింది. కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి మిగల కుండా అన్ని అవకాశాలను సంపూర్ణంగా వినియోగించుకుంది. అలా అప్పుపుట్టే దారులన్నీ ఇంచుమించుగా మూసుకు పోయాయి . మరో వంక అప్పు లేకుండా పూట గడిచే మార్గం లేదు.ఇలాంటి పరిస్థితిలో మాములుగా అయితే ప్రభుత్వం ముందున్న ఒకే ఒక్క మార్గం చేతులు ఎత్తేయడం.అంతకు మించి మరో మార్గం లేదని ఆర్థిక నిపుణులు ఎప్పుడోనే ఒక నిర్ణయానికి వచ్చారు.  అవును కేవలం ఆర్ధిక శాస్త్రం మాత్రమే చదువుకున్న,ఆర్థిక రంగ నిపుణులకు, చట్టాలు మాత్రమే తెలిసి వాటి ఉల్లంఘన మార్గాలు తెలియని అధికారులకు చేతులు ఎత్తేయడం సహజం. వారికి అది మినహా మరో మార్గం కనిపించక పోవచ్చును.  కానీ, రవి గాంచనిచో కవి గాంచున్’ అన్నట్లుగా ఆర్థిక రంగ నిపుణలకు కనిపించని ఆప్పు దారులు,అక్రమ మార్గాలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వారి బృందం దివ్య నేత్రాలకు కనిపిస్తాయి కావచ్చును.. అందుకే, జగన్ రెడ్డి ప్రభుత్వం అప్పుకు మరో కొత్త మార్గాన్ని కనుగొంది. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీల పరిమితిని ఏకంగా రెట్టింపు చేసుకుంటూ చట్టాన్ని సవరించింది.  

అదికూడా ఓ వంక కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రాష్ట్ర సర్కారు ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతోందని లెక్క తేల్చిన రోజునే మరో లక్ష కోట్ల రుణం తీసుకునే వెసులుబాటు ‘కల్పించుకుంటూ’ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.నిజానికి ‘కాగ్’ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శాసన సభ నియంత్రన దాటిపోయే, స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు అడ్డదారులు తొక్కాయని తప్పు పట్టింది. బడ్జెట్’లో చూపకుండా చేస్తున్నఖర్చులు, అందుకోసం చేస్తున్న అప్పులు కొండలా పెరిగిపోతున్నాయని అక్షింతలు వేసింది.వచ్చే ఏడేళ్లలో ప్రతి సంవత్సరం లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పు చెల్లించవలసి ఉంటుందన్న కాగ్, అప్పు తీర్చడానికి కొత్త అప్పులు చేయడం ఏమిటని విస్మయాన్ని ప్రకటించింది. 

అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం కాగ్’ ఏమి చెప్పిందన్న విషయాన్ని పక్కన పెట్టి కొత్త కొత్త ఇన్నోవేటివ్ పద్దతుల్లో అప్పులు చేస్తోంది. కేంద్రంతో సంబంధం లేకుండానే,చట్టాలను  సవరించి కొత్త అప్పులకు సిద్దమవుతోంది. నిజానికి కేంద్రం రూపొందించిన గ్యారెంటీ పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం  రూ.5600 కోట్ల రుణానికి మాత్రమే హామీ ఇవ్వగలదు. కానీ... ఇప్పటికే ఇంచుమించుగా అంతకు రెట్టింపు రూ.1,10,000 కోట్లకు గ్యారెంటీ ఇచ్చింది .ఇది కూడా సరిపోదని ఇప్పుడు చట్టాన్ని సవరించింది. మరో రూ.లక్ష కోట్లకు హామీ చ్చేందుకు వీలుగా ప్రభుత్వం సభలో ఉన్నబలంతో చట్టాని సవరించింది. అయితే, ఇలా సవరించిన చట్టం చెల్లుతుందా, అంటే, ప్రభుత్వ వైఖరి  నిండా మునిగిన వణికి చలేమిటి అన్నట్లుగా ఉందని అధికారులు అంటున్నారు. 

అయితే ఇలా వంద రూపాయల విలువైన వస్తువును కుదువ పెట్టి రూ.200 అప్పు తీసుకోవడం మాములుగా అయితే కుదిరే వ్యవహారం కాదు. కానీ, అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రూ.3,00,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చిన జగన్‌ ప్రభుత్వానికి మాత్రం సాధ్యం కావచ్చని, అయితే ఇలా అడ్డ దారుల్లో తెచ్చిన అప్పులు  చివరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను  ఏ అధః పాతాళానికి తీసుకుపోతాయో మాత్రం చెప్పలేమని ఇటు అధికారులు, అటు ఆర్థిక రంగ నిపుణులు  అంటున్నారు.