రోజా పొగడ్తలు మంత్రి పదవి కోసమేనా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి వర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారో, అసలు విస్తరిస్తారో లేదో కూడా ఎవరికీ, తెలియదు. అయితే, మంత్రి పదవులు ఆశిస్తున్న వారు మాత్రం ... ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఏదో విధంగా ఈ సారి మంత్రి పదవి దక్కించుకోవాలని, లేదంటే ఇక  ఈ జన్మకు మంత్రి పదవి దక్కే అవకాశమే ఉండదని, వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఆశల పందిళ్ళు అల్లుకుంటున్నారు. అయితే అలాంటివారు ఎందరున్నా అందరిలోకి, ప్రత్యేకంగా చెప్పుకోవలసిన ఒకే ఒక్కరు మాత్రం మరెవరో కాదు, ది జబర్దస్త్ ఫేమ్ ...  నగరి ఎమ్మెల్యే రోజా. 

ఆమె మంత్రి పదవికోసం, తొక్కని గడప లేదు మొక్కని దేవుడు లేదు అన్న విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి మొదలు అందరు దేవుళ్ళను మొక్కుకుంటూనే ఉన్నారు. దేవుళ్ళనే కాదు,  జ్యోతిషులను నమ్ముకున్నారు. గ్రహదోషాలను దూరం చేసుకునేందుకు ఆశ్రమాలలోప్రత్యేక పూజలు, యజ్ఞయాగాదులు చేయిస్తున్నట్లు, ఆ మధ్య సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అయింది. 
అయితే, కేవలం దేవుళ్ళను,జ్యోతిషులను నమ్ముకుంటే సరిపోదని గ్రహించి  వెంకన్న దేవుని కంటే ఆల్ పవర్ఫుల్ గాడ్’ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని  స్తోత్ర గీతాలతో, పొగడ్తలతో ముంచెత్తు తున్నారని అంటున్నారు. అసెంబ్లీ లోపల బయటా  కూడా రోజా ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

ఈ రోజు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రోజా మరోసారి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొత్త దేవుడంత గొప్ప మనసున్న మనిషని, మనషుల్లో దేవుడని అర్థం వచ్చేలా పొగడ్తలను కుంభ వృష్టిగా కురిపించారు. రోజా పొగడ్తల ప్రవాహధాటికి తట్టుకోలేక కావచ్చు, స్పీకర్ తమ్మినేని సీతారాం బ్రేక్ వేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు మాత్రేమే అడగాలని, సూచించారు. అయితే,రోజా మాత్రం, జగన్ రెడ్డిలో ఎవరికి కనిపించని సుగుణాలను ఏర్చి కూర్చి ప్రసంగాన్ని కొనసాగించరు. జగన్ రెడ్డి ప్రతి స్త్రీని ఒక తల్లిలా, ప్రతి ఆడపడుచును ఒక సోదరిలా చూస్తారని, కులం మతం ప్రాంతం అన్న తేడా లేకుండా పేద లందరినీ ‘ప్రభువు’ లా ఆడుకుంటున్నారని, జగనన్న పాలనలో రాష్ట్రంలోని  ప్రతి మహిళ సంతోషం  ఉన్నారని .. తమదైన శైలిలో ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. చివరకు అదే నోటితో, అంతటి మహా పురుషుని, మచ్చలేని మనిషిని కొందరు అవమానిస్తున్నారని అవాకులు చవాకులు పలుకు తున్నారని, ఓ రెండు గ్లిజరిన్ చుక్కలు కూడా రాల్చారు. 

అయితే, ఇంత చేసినా చివరకు రోజాకు మంత్రి  పదవి దక్కుతుందా అంటే, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి  ఉన్నంతవరకు ఆమెకు మంత్రి పదవి రాదు గాక రాదని అంటున్నారు.  ఏమో .. ఆ ఇద్దరి మధ్య ఏముందో ... ఎవరికి తెలుసు.