టీఆర్ఎస్‌కి ఓటమి భయం పట్టుకుంది
posted on Apr 24, 2014 12:01PM
.jpg)
ఈ ఎన్నికలలో 90 అసెంబ్లీ స్థానాలు తమ పార్టీ సంపాదించుకుంటుందని, తెలంగాణలో ప్రభుత్వం స్థాపించడంతోపాటు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతుందని టీఆర్ఎస్ నాయకులు పైకి చెబుతున్నారు. మొన్నటి వరకూ 60 సీట్లు వస్తాయని అనుకున్నామని, ఇప్పుడు 90 వస్తాయని అనుకుంటున్నామని ప్రకటిస్తున్నారు. అయితే బయట పరిస్థితి చూస్తే టీఆర్ఎస్‌కి అంత సీన్ కనిపించడంలేదు. అందుకే పైకి ఎంత డాంబికాలు పలుకుతున్నా, లోలోపల మాత్రం టీఆర్ఎస్ నాయకులను ఓటమి భయం పట్టి పీడిస్తోంది.
అందుకే అప్పుడప్పుడు నోరు జారి నిర్వేదంగా మాట్లాడుతున్నారు. టీడీపీ, బీజేపీ పొత్తు పక్కాగా కుదరడంతో ఆ రెండు పార్టీలకి తెలంగాణ ప్రజల్లో మద్దతు పెరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ లేనిపోని ఉద్రికత్తలు పెంచి లాభపడటం తప్ప తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చే సమయంలో మోడీని తిట్టిపోసే టీఆర్ఎస్‌కి ఓటేస్తే భవిష్యత్తులో మోడీ ప్రభుత్వం టీఆర్ఎస్‌కి సహకరించదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే టీఆర్ఎస్ కేవలం ఉత్తర తెలంగాణలో మాత్రమే బలంగా కనిపిస్తోంది.
దక్షిణ తెలంగాణలో ఆ పార్టీని పట్టించుకునేవారే కనిపించడంలేదు. ఖమ్మం జిల్లాలో అయితే టీఆర్ఎస్ ఊసే లేదు. దీంతోపాటు తెలంగాణ అంతటా టీఆర్ఎస్ అభ్యర్థుల్లో చాలామంది బలహీనంగా వున్నారు. ఇలా అనేక కారణాలు టీఆర్ఎస్‌ని ఓటమి వైపు తీసుకెళ్తున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న టీఆర్ఎస్ నేతలు వారం రోజుల నుంచి నిర్వేదంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ అయితే నన్ను గెలిపిస్తే తెలంగాణని పాలిస్తా, లేకపోతే రెస్ట్ తీసుకుంటానని నిర్మొహమాటంగా ప్రకటించేశారు. టీఆర్ఎస్ మిగతా నాయకులు కూడా అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే టీఆర్ఎస్ ఎన్నికల ముందే ఓటమిని ఒప్పుకోక తప్పేట్టులేదు.