ఏపీఎన్జీవోలను దువ్వుతున్న జైరాం

 

 

 

ప్రస్తుతం తెలుగుదేశానికి దగ్గరై వున్న ఏపీఎన్జీవోలను దువ్వడానికి కేంద్ర మంత్రి జైరాం రమేష్ పెద్ద దువ్వెనతో సిద్ధమయ్యారు. సీమాంధ్రలో ఉద్యోగులందరూ తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఓటు వేయడానికి మానసికంగా సిద్ధమైపోయారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెబితేనే ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల మద్దతు లేని పార్టీ గెలిచిన దాఖాలాలు చరిత్రలో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీఎన్జీవోలను మచ్చిక చేసుకోవడం ద్వారా సీమాంధ్రలో గండం నుంచి గట్టెక్కాలని జైరాం రమేష్ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్‌లో భాగంగా ఏపీఎన్జీవోలతో సమావేశం ఏర్పాటు చేశారు.

 

ప్రస్తుతం ఏపీఎన్జీవోలు ‘ఆప్షన్లు ఉండాల్సిందే’ అనే పట్టు మీద వున్నారు. వారికి ఏం కావాలో వారికి ఇచ్చి తమకు ఏంకావాలో అది తీసుకునే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో జైరాం రమేష్ వ్యవహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి తీరతామని వాళ్ళకి హామీ ఇచ్చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని వాళ్ళకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.


రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులకు అన్యాయం జరగకుండా వుండాలంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించాలని  ఉద్యోగ సంఘాల నాయకులను కోరినట్టు సమాచారం. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి సీమాంధ్రులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని సీమాంధ్రులెవరూ నమ్మరన్న విషయాన్ని జైరాం రమేష్ మరచిపోయినట్టున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతమే విభజించి పాలించు. అందుకే రాష్ట్రాన్ని విభజించి కూడా రెండు ప్రాంతాలనీ పాలించాలని అనుకుంటోంది. ఈ విషయంలో ఏపీఎన్జీవోలని కూడా అనాలి. రాష్ట్రం అడ్డగోలు విభజనకు జైరాం రమేష్ కూడా కారణమని తెలిసి కూడా, ఆయన పిలవగానే కలవటానికి వెళ్ళారు. వినతిపత్రాలు సమర్పించారు. ఆయన చెప్పిన సోది అంతా విని వచ్చారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu