పార్టీ కార్యకర్తలకే పథకాలు!

తెలుగు రాష్ట్రాల్లో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. రాష్ట్రాల బడ్జెట్ లో సింహభాగం నిధులు సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నా.. అవి ఎవరికి అందుతున్నాయనే దానిపై చాలా విమర్శలు వస్తున్నాయి. అర్హులకు కాకుండా అధికార పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే అదే అర్ధం వచ్చేలా మాట్లాడి కలకలం రేపారు. 


తెలంగాణలోని జనగామ జిల్లా స్టేషన్  ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటేనే ఇకపై ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీని రక్షించుకోవడానికి ఇదే మార్గం అని పేర్కొన్నారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇండ్లకూ ఇదే వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నికల వరకే రాజకీయాలు… ఆ తర్వాత సంక్షేమ పథకాలు అందరికీ అందించేలా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఇప్పటి నుంచి మూడేండ్ల వరకు టీఆర్ఎస్ మెంబర్ షిప్ ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అని అన్నారు.

స్టేషన్ ఘనపూర్  టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలకే పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే చెప్పడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అది కూడా పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే ఇస్తామనడం దారుణం అంటున్నారు జనాలు.