తెరాస కత్తికి రెండు వైపులా పదునే!
posted on Oct 10, 2015 11:40AM
.jpg)
తెరాస నేతల కత్తికి రెండు వైపులా పదునే అని మంత్రి కె. తారక రామారావు మరొకమారు నిరూపించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించమని తెరాస ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఈరోజు రాష్ట్ర బంద్ పాటిస్తుంటే, దానికి ఆయన సానుకూలంగా స్పందించకుండా తిరిగి వారిపైనే ఎదురుదాడి చేసారు. గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణాని దోచుకుతిని సర్వనాశనం చేసిన రాబందులు అన్నీ కట్టకట్టుకొని ప్రజల వద్దకు వస్తున్నాయని ఎద్దేవా చేసారు. ఇంతవరకు ఈ సమస్యకు గత ప్రభుత్వాలదే బాధ్యత అని వాదిస్తూ తెరాస ప్రభుత్వం చేతులు దులుపుకొంటోంది. కానీ మంత్రి కేటీఆర్ మరో అడుగు ముందుకు వేసి ఈసారి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీనే అందుకు బాధ్యులని విమర్శిస్తున్నారు.
ప్రధాని మోడీ బీజేపీ పాలిత రాష్ట్రాలపట్ల ఒక విధంగా ఇతర రాష్ట్రాల పట్ల మరొకలాగా సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. ప్రధానిగా ఉన్న వ్యక్తికి అది తగదని విమర్శించారు. "బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం కోసం ఆ రాష్ట్రానికి రూ.1.25లక్షల కోట్లు నిధులు మంజూరు చేసారు. కానీ తెలంగాణా కోసం నిధులు విడుదల చేయడం లేదు. పంట రుణాలు మొత్తం ఒకేసారి చెల్లించాలని ఉద్యమిస్తున్న బీజేపీ నేతలు ఈ విషయం గురించి మాట్లాడరు. వారికి దమ్ము ఉంటే డిల్లీ వెళ్లి వారి పార్టీ అధిష్టానంతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు విడుదల చేయించాలి. లేకుంటే ఇటువంటి చిల్లర ఫీట్లు చేయడం మానుకోవాలి,” అని హితవు పలికారు.
కానీ తెలంగాణా ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు రైతుల రుణాలను మాఫీ ఎందుకు చేయలేకపోతున్నారు? హుస్సేన్ సాగర్ ఒడ్డున 150 అంతస్తుల భవనం నిర్మిస్తే బాగుంటుందా లేకపోతే లేదా 153... 156 అంతస్తులు నిర్మిస్తే బాగుంటుందా? లేకపోతే కేసీఆర్ లక్కీ నెంబర్ ప్రకారం నిర్మిస్తే బాగుంటుందా? అని గాలిమేడలు కడుతున్న తెరాస ప్రభుత్వం ఆర్ధిక సమస్యలను తట్టుకోలేక అన్యాయంగా ప్రాణాలు తీసుకొంటున్న రైతన్నలను కాపాడేందుకు డబ్బు ఎందుకు తీయడం లేదు? అవసరం లేని అటువంటి ప్రాజెక్టులకు డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడని తెరాస ప్రభుత్వం రైతన్నల కోసం కేవలం రూ.8, 500 కోట్లు చెల్లించడానికి ఎందుకు వెనకాడుతోంది? గత ప్రభుత్వాలని, కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రజలను ఎంత కాలం మభ్యపెట్టగలరు? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా మంత్రి కె. తారక రామారావు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడుతున్నారు.