తెరాసలో గిరిజన రిజర్వేషన్ల జీవో టెన్షన్, టెర్రర్

తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన గిరిజన రిజర్వేషన్ ప్రకటన అధికార తెరాస నేతలకు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకతతో సతమతమౌతున్న పార్టీకి ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన గిరిజన రిజర్వేషన్ ప్రకటన ఆ వ్యతిరేకతను మరింత పెంచేదిగా మారిందంటున్నారు.  

అదెలాగంటే.. కేంద్ర ప్రభుత్వానికి ఒక వ్యూహం, సరైన విధానం లేదనేది  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, తెరాస నాయకులు నిత్యం జపంలా చేస్తున్న ఆరోపణ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సరైన ఆలోచన, ప్రణాళిక లేక పోవడం వల్లనే అన్ని వర్గాల ప్రజలు అవస్థల పాలవుతున్నారన్నది వారు చేస్తున్న మరో ఆరోపణ. కేంద్ర ప్రభుత్వానికి అసలు తలకాయే లేదని,  ఇలా తెరాస నాయకులు తరచూ చేసే ఆరోపణలు ఇంకా చాలానే ఉన్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం చేతగానితనం సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్  గిరిజన రిజర్వేషన్ల ప్రకటనతో అవే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

అది కుడా రాజకీయ ప్రత్యర్దుల నుంచి కాదు, నేరుగా బాధితుల నుంచే ఈ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. కొద్ది నెలల కిందట, అసెంబ్లీ శీతాకాల సమావేశాల సమయంలో, నిరుద్యోగులు వీధుల కెక్కిన ఆందోళన చేస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రంలో 80 వేలఉద్యోగాల  భర్తీకి  దశల  వారీగా  నోటిఫికేషన్లు జారీ చేస్తామని  అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ సంవత్సరం ముగిసే సమయానికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి, నెక్స్ట్ ఇయర్ నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకటించి, ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ  చేస్తామని, చాలా నమ్మకంగా చెప్పారు.

గడచిన ఐదారు నెలలో ఆ ప్రక్రియ కొంత ప్రారంభమైంది, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల కూడా విడుదల అవుతున్నాయి. ఇప్పటికే పోలీస్‌ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష కూడా ముగిసింది. అక్టోబర్‌లో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ జరగనుంది.అలాగే ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత పరీక్ష, టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌)ను కూడా ప్రభుత్వం ఇటీవలే నిర్వహించింది. ఫలితాలు కూడా వచ్చాయి. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులు, ఉపాధ్యాయ ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటచేసిన నాటినుంచి 52 వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇంకా గ్రూప్‌–2, గ్రూప్‌–4 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ రావాల్సి ఉంది. నోటిఫికేషన్లు ఎప్పుడైనా రావొచ్చని మంత్రులు, ప్రకటిస్తున్నారు. మరో వంక ఎంతో కాలంగా, నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు,చిరుద్యోగులు ఇతర వ్యాపకాలు అన్నీ పక్కన పెట్టి, పరీక్షలకు సిద్దమవుతున్నారు.

అయితే, ఇంతలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 17న పిడుగు లాంటి ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో బంజారా, ఆదివాసీ భవన్‌లను ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సభలో రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. ఈమేరకు వారం రోజుల్లో నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపారు. అయితే.. ఈ రిజర్వేషన్లు ఇకపై  విడుదలయ్యే నోటిఫికేషన్లకు మాత్రమే వర్తిస్తుందా? లేదా.. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు కూడా వర్తిస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పది శాతం గిరిజన రిజర్వేషనలకు సంబంధించి జీవో విడుదల అయితనే గానీ ఈ విషయంలో స్పష్టత రాదు. అయితే, ఒక వేళ ప్రభుత్వం జీవోలో స్పష్టత ఇచ్చినా, గిరిజనులు లేదా గిరిజనేతరులు ఎవరు, ఏ సాకున కోర్టును ఆశ్రయించినా, ఇప్పటికే మొదలైన నియామక ప్రక్రియ మొత్తం నిలిచిపోయే ప్రమాదం ఉందాని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి నిరుద్యోలు, చిన్నాచితక  ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్న యువత, ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు ఇదే ఆఖరి అవకాశంగా భావిస్తున్నారు. అందుకే, చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలను వదిలేసి మరీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. లక్షలాది మంది యువకులు వేల రూపాయలు వెచ్చించి హైదరాబాద్‌ లోని కోచింగ్‌ సెంటర్ల బాట పట్టారు.  అయితే.. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసేఆర్ చేసిన గిరిజన రిజర్వేషన్ ప్రకటనతో మొత్తం నియామక ప్రక్రియ నిలిచి పోతుందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్త చేస్తునారు.  ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం తమ  పాలిట శాపంగా మారిందని, ఆవేదన,ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు జీవోతో 80 వేల ఉద్యోగాల్లో లబ్ధి పొందే గిరిజనులు 4 వేలు, కానీ ఈ జీవో కారణంగా నోటిఫికేషన్లు రద్దు చేస్తే మాత్రం లక్షల మంది నిరుద్యోగుల ఆశలు అడియాశలవుతాయి.

అందుకే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం  ఉద్దేశపూర్వకంగానే, గిరిజన రిజర్వేషన్ల ప్రకటన చేసిందని అనుమానిస్తున్నారు. మరోవంక ఇప్పటికే, వందల మంది నిరుద్యోగ యువకుల ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో, ఇంకా ఇప్పటికీ నిరుద్యోగుల కలలు నెరవేరలేదు సరికదా, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు ఆగలేదు.

ఇక  ఇప్పడు, ఈ అవకాశం కూడా చేజారిపోతే, ఇదే చివరి అవకాశంగా ఆశలు పెంచుకున్న నిరుద్యోగ యువత ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది మరింత ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈ అంతటికీ ముఖ్యమంత్రి అనాలోచిత ప్రకటనే కారణమని అధికారులు సైతం ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. అదే విధంగా, అధికార పార్టీ నాయకులూ, ఎమ్మెల్యేలు కుడా గిరిజన రిజర్వేషన్ జీవో వస్తే ఒక ఒక తంటా , రాకుంటే మరో తంటా అంటూ తలలు పట్టుకుంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu