తెలంగాణ జగిత్యాలలో విషాదం....పసుపు బట్టలతోనే ఉరేసుకున్న పెళ్లికొడుకు
posted on Mar 8, 2025 11:40AM
సరిగా పెళ్లికి ఒక రోజు ముందు వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రామచంద్రం పేట గ్రామంలో చోటు చేసుకుంది. ఇంట్లో తన గదిలోనే 37 ఏళ్ల లక్కంపెళ్లి కిరణ్ పసుపు బట్టల్లోనే ఉరి తాడు వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు . తెల్లారితే పెళ్లి పీటలెక్కాల్సిన కిరణ్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఎంతో సంతోషంగా ప్రీవెడ్డింగ్ షూట్ చేసుకున్న కిరణ్ ఇంతలోనే విగతజీవిగా మారిపోయాడు.
ఇల్లంతా బంధుమిత్రులతో సందడి సందడిగా ఉంది. కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో తలామునకలయ్యారు. శుక్రవారం నాడు కొత్తగా పెళ్లి చేసుకోబోయే వధూవరులు ప్రీవెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. రాత్రి ఇంటికి వచ్చిన కిరణ్ తన గదిలో పడుకోవడానికి వెళ్లి శాశ్వతంగా నిద్రపోయాడు. పెళ్లికొడుకును ముస్తాబు చేయాలనుకున్న కుటుంబసభ్యులు కిరణ్ ను నిద్రలేపేందుకు గదిలోకి వెళ్లి షాక్ అయ్యారు. గదిలో కిరణ్ ఉరివేసుకుని విగత జీవిగా కనిపించడమే కారణం. వెంటనే కిరణ్ ను కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు. కిరణ్ అప్పటికే ఈ లోకం విడిచి వెళ్లిపోయాడు. మెట్ పల్లి పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది