చాంపియన్స్ ట్రోఫీ 2025.. ఫైనల్స్ లో పాక్ ఆడటం లేదు.. పాక్ లో ఫైనల్స్ జరగడం లేదు!

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అన్నట్లుగా తయారైంది పాకిస్థాన్ పరిస్థితి. దాదాపు మూడు దశాబ్దాల తరువాత పాకిస్థాన్ ఒక ఐసీసీ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ అవకాశం  కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసింది. ఈ ఒక్క టోర్నీ నిర్వహణతో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేయయొచ్చని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్నో కలలుకంది, ఆశలు పెట్టుకుంది.  అయితే ఆ కలలన్నీ కళ్లలయ్యాయి. ఆశలన్నీ అడియాశలయ్యాయి.  

భద్రతా కారణాలు, ద్వైపాక్షిక సంబంధాల కారణంగా పాకిస్థాన్ లో మ్యాచ్ లు ఆడేందుకు భారత్ నిరాకరించింది. దీంతో అనివార్యంగా ఈ టోర్నీలో భారత్ అడే మ్యాచ్ లను తటస్థ వేదిక అయిన దుబాయ్ లో నిర్వహించేందుక పీసీపీ అంగీకరించింది. భారత్ వినా మిగిలిన జట్లు ఆడే మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వడానికి దేశంలోని స్టేడియంలను ముస్తాబు చేసింది. వివాదాలకు ఇసుమంతైనా తావు లేకుండా నిర్వహించాల్సిన టోర్నీని పీసీబీ వివాదంతో ప్రారంభించింది. టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జెండాలనూ ప్రారంభ ఉత్సవంలో ప్రదర్శించాల్సి ఉండగా, పీసీబీ భారత్ జెండా లేకుండానే టోర్నీని ప్రారంభించింది. ఇది వివాదం కావడం, అసలు టోర్నీ జరుగుతుందా లేదా అన్న స్థాయికి వెళ్లడంతో పీసీబీ దిగి వచ్చింది. 

ఇక అంతర్జాతీయ టోర్నీ నిర్వహణ ద్వారా భారీ ఆదాయం ఉంటుందని ఆశించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సొంత జట్టు చెత్త ప్రదర్శన కారణంగా పెట్టిన ఖర్చులు కూడా వెనక్కు రాని పరిస్థితి ఎదురైంది. పాక్ జట్టు స్వదేశంలో కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. ప్రారంభ మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడిన పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తరువాతి మ్యాచ్ దుబాయ్ వేదికగా భారత్ తో జరిగింది. ఆ మ్యాచ్ లోనూ పాకిస్థాన్ చెత్త ప్రదర్శనతో కనీసం పోటీ కూడా ఇవ్వకుండా పరాజయం పాలైంది. మూడో మ్యాచ్ మళ్లీ పాకిస్థాన్ లో ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో స్వదేశంలో నిర్వహించిన టోర్నీలో పాక్.. కనీసం నాకౌట్ కు కూడా చేరుకోకుండా పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచింది. దీంతో పాకిస్థాన్ లో జరిగిన మ్యాచ్ లకు ప్రేక్షకులు కరవయ్యారు. 12వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టి స్టేడియంలను ముస్తాబు చేసిన ఖర్చంతా వృధా అయిపోయింది. ఆదాయం మాట దేవుడెరుగు పీసీబీ నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో పాకిస్థాన్ ఫైనల్ ఆడటం లేదు.. అసలు పాకిస్థాన్ లోనే ఫైనల్ జరగడం లేదు అని నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9) భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu