అమరావతికి జేడీ జై.. రోశయ్యకు నివాళి.. కొవిడ్ పంజా.. జనాలను చంపేశారు.. టాప్ న్యూస్@1PM

అమరావతి రైతుల మహాపాదయాత్రకు జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో అక్కడి వనరులు, సౌలభ్యం మేరకే అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవసరమైన చోట హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయొచ్చునని అన్నారు. రైతుల పాదయాత్రకు మద్దతిచ్చినవారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. 
------
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తెలుగు ప్రజలకు, రాజకీయాలకు తీరని లోటని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అపర రాజకీయ చాణక్యున్ని కోల్పోయామన్నారు. రోశయ్య ఆర్థిక నిపుణుడు, అద్భుత మేధావి అని కొనియాడారు. తాను శాశనసభ చూడాలనుకున్నపుడు మొదట రోశయ్యనే చూశానన్నారు. రామారావు, రోశయ్య చాలా సన్నిహితంగా ఉండేవారన్నారు. తాను విద్యార్థి దశ నుంచే ఎంతో నేర్చుకున్నానన్నారు.
-------
కర్నూలు జిల్లా సిద్దాపురం చెరువు గండిపడడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. అయినా గండి ద్వారా నీరు లీకేజీ అవుతోంది. దీంతో నీటి ఉధృతిని తగ్గించేందుకు అధికారులు అలుగు కొట్టి ఫారెస్టులోకి నీరు వదులుతున్నారు. సిద్దాపురం చెరువులో ప్రస్తుతం 19 అడుగుల మేర నీరు ఉంది. కాగా చెరువులోని నీరు వృధాగా బయటకు వదులుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు
----------
దర్శి మోడల్ స్కూల్ వద్ద విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. పాఠశాల భవనం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఫుడ్ మెనూ సక్రమంగా పాటించటం లేదంటూ బాలికలు నినాదాలు చేశారు. తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని.. సిబ్బందికి చెబుతున్నా పట్టించుకోవటం లేదంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు
---------
కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు కృష్ణా నదిలో దీపాలు వదులుతూ పోలి స్వర్గానికి పంపించారు. మహిళలు అరటి డోప్పల్లో 31 వత్తులు వెలిగించి ఓం నమ:శివాయ అంటూ కార్తీక దీపాలను వదిలారు. అలాగే శివాలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అటు నరసాపురంలో కార్తీక మాసం ముగియడంతో భక్తులు వశిష్ట గోదావరికి పోటెత్తారు. పోలు పాడ్యమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు
-----------
రెండు వారాల క్రితం హైదరాబాద్ లో స్వల్పంగా ఉన్న కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బహదూర్‌పల్లిలో ఓ యూనివర్సిటీలో 25 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడ్డారు. తాజాగా బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఓ టౌన్‌షి‌ప్‌లో పది మందికి కరోనా సోకింది. మెల్లమెల్లగా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం 66 ఉన్న సంఖ్య ఈ నెల 3కు 82కు చేరింది.
--------
జమ్మూ-కశ్మీరులో కొత్తగా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం తనకు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు. అయితే భవిష్యత్తులో రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. అధికరణ 370 రద్దు తర్వాత నిలిచిపోయిన రాజకీయ కార్యకలాపాలను పునరుద్ధరించడం కోసమే తాను  సమావేశాలు, సభలను నిర్వహిస్తున్నానని చెప్పారు.
------
ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌ లో ఘోరం జరిగింది. ఉగ్రవాదులు అనుకొని సాధారణ పౌరులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 14 మంది పౌరులు చనిపోయారని తెలుస్తోంది.మృతుల సంఖ్యపై కొంత గందరగోళం నెలకొంది. ఆరుగురు చనిపోయారని అధికారులు చెబుతుంటే.. మొత్తం 14 మందిని చంపేశారని స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలుస్తోంది.  మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 
---------
యాంకర్ అనసూయ ఇంట విషాదం నెలకొంది. ఆవిడ తండ్రి సుధాకర్ రావు ఖస్బా మృతి చెందారు.  ఆయన వయసు 63 సంవత్సరాలు. కొంతకాలంగా కేన్సర్ తో పోరాడుతున్న ఆయన తార్నాకలోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాసవిడిచారు. రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉండే కాలంలో సుధాకర్ రావు యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రటరీగా పనిచేశారు. ఆయనకి భార్య,  అనసూయ, వైష్ణవి కుమార్తెలు.  సుధాకర్ రావు మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.
--------
ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ కు సంబంధించిన భయంకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సౌతాఫ్రికాలో మొదటగా వెలుగుచూసిన మాయదారి ఒమిక్రాన్‌ వైరస్ ఇప్పటివరకు 38 దేశాలకు వ్యాపించింది. అయితే ఒమిక్రాన్ తో ఇంతవరకు ఎవరూ చనిపోలేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఒమిక్రాన్ తొలి కేసు నమోదైన సౌతాఫ్రికాలో వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య మూడింతలు అయ్యింది.