అమరావతితోనే ఏపీ అభివృద్ధి.. రైతులకు జేడీ లక్ష్మినారాయణ మద్దతు

అమరావతి రైతులకు మద్దతు రోజు రోజుకు పెరుగుతోంది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో సాగుతున్న మహా పాదయాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. అమరావతి రైతుల మహాపాదయాత్రకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం రైతుల యాత్ర నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలంలో కొనసాగుతోంది. ఆదివారం ఉదయం బాలాయపల్లికి చేరుకున్న జేడ లక్ష్మినారాయణ.. అమరావతి రైతులను కలిశారు. వాళ్లతో కలిసి కొంత దూరం నడిచారు. 

అమరావతిని రాజధానిగా కొనసాగిస్తేనే  అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్బంగా జేడీ లక్ష్మినారాయణ అన్నారు. అన్ని ప్రాంతాల్లో అక్కడి వనరులు, సౌలభ్యం మేరకే అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవసరమైన చోట హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయొచ్చునని అన్నారు. రైతుల పాదయాత్రకు మద్దతిచ్చినవారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. అమరావతి ఉద్యమం ఏ ఒక్కరికో చెందినది కాదని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలలో ముగిసి వెంకటగిరి నియోజకవర్గంలోకి ఎంటరైంది. రైతుల మహా పాదయాత్రకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.