అఖండకు దెబ్బ.. వంశీ సారీ.. వామ్మో చెడ్డీ గ్యాంగ్  మండలి ట్విస్ట్.. టాప్ న్యూస్ @1PM

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ’అఖండ’ సినిమా విడుదలైంది. ఏపీ ప్రభుత్వం బెన్ ఫిట్ షోలకు అనుమతి రద్దు చేసింది. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారం ధియేటర్లను నడపలేమని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో సింగిల్ ధియేటర్‌లు పూర్తిగా మూత పడతాయన్నారు  ఎగ్జిబిటర్ విజయ్ కుమార్.  పది మంది చేసే తప్పు చూపించి వేల మంది కడుపు కొడుతున్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తప్పులను సరి చేయాలి గానీ.. అసలు వ్యవస్థనే నాశనం చేయడం ఏమిటని ప్రశ్నించారు
-------
చంద్రబాబు సతీమణిపై వ్యాఖ్యల విషయంలో వంశీ చెప్పిన క్షమాపణలను నమ్మలేమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ‘‘వంశీ సారీ కాదు... మాకు చంద్రబాబు కన్నీళ్లు కనిపిస్తున్నాయి’’ అని తెలిపారు. వంశీ ఇటు సారీ అంటారు...కొడాలి మళ్ళీ మీదే తప్పు అంటారని మండిపడ్డారు. వల్లభనేని 5 శాతమే తప్పు చేసారని కొడాలి అనడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పినట్లు తాము భావించడం లేదని అనిత అన్నారు. 
-------
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో గంగిరెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి కావాలనే తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గంగిరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. గంగిరెడ్డి తరుపున సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు పిటిషన్ ధాఖలు చేశారు. 
-----
అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర 32వ రోజు కొనసాగుతోంది. గురువారం నెల్లూరు జిల్లా, మరిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగుతోంది. ఈ రాత్రికి తురిమేర్లలో అమరావతి రైతులు బస చేయనున్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీజేపీ నేత ఆంజనేయులు పాదయాత్రలో పాల్గొన్నారు. అడుగడుగునా ఆంక్షలతో పోలీసులు, వైసీపీ నేతలు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
------
ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. పాడైన ధాన్యం నుంచి ఆర్ఎస్ స్పిరిట్ తయారు చేసే పరిశోధనలు చేయించాలని సూచించారు. పరిశోధనలు ఫలిస్తే జిల్లాకొక స్పిరిట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని లేఖలో ప్రస్తావించారు. తద్వారా ధాన్యానికి మద్దతు సమస్య ఉండదన్నారు. 
---
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు భోజనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఏరియా ఆసుపత్రిలో భోజనాలను నిలుపుదల చేశారు. నెలల తరబడి కాంట్రాక్టరుకు బిల్లులు అందడం లేదు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోని పరిస్థితి. భోజనాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రూ.12 లక్షల మేర బిల్లు పెండింగ్‌లో ఉండడంతో ముందస్తుగా సూపరింటెండెంట్‌కు కాంట్రాక్టర్ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. 
------
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గుంటుపల్లిలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. బుధవారం రాత్రి గుంటుపల్లి గ్రామంలో ఒక అపార్ట్మెంట్‌లోకి చెడ్డి గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు దోపిడీకి యత్నించారు. అలికిడి వినిపించి లైట్లు వేయటంతో దొంగలు పరారయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
------
కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. బెంగుళూరులో అధికార పార్టీ క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ పెట్టింది. మంథని నుంచి క్యాంపునకు 35 మంది ప్రజాప్రతినిధులు వెళ్లారు. పోటీలో లేని కాంగ్రెస్.. క్యాంపు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ మద్దతు ఎవరికో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
----
హైదరాబాద్  శివార్లలోని రాజేంద్రనగర్ బండ్లగూడలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. విదేశీయులే లక్ష్యంగా బండ్లగూడ, రాధానగర్‌ కాలనీలో 150 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. దాదారు 200 ఇండ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరంతా వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలో అక్రమంగా ఉంటున్నారని పోలీసులు చెప్పారు.
----
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఆందోళనలు కొనసాగించాలని టీఆర్‌ఎస్‌తోపాటు విపక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ధర్నా చేయనున్నారు. అదేవిధంగా రాజ్యసభలో 12 మంది సభ్యులను అకారణంగా సస్పెండ్‌ చేశారని, వారిపై నిషేదాన్ని ఎత్తివేయాలని సభలో, బయట నిరసన తెలపనున్నారు.

Related Segment News